న్యూఢిల్లీ: టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరీతో శుక్రవారం జరగనుంది. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో రైనా
చిన్ననాటి స్నేహితురాలి ప్రియాంక చౌదరీని పెళ్లి చేసుకుంటున్నాడు. రైనా వివాహానికి టీమిండియా జట్టు సభ్యులతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
పెళ్లి ఎలా కుదిరింది:
సురేష్ రైనా పెళ్లికి అభినందనలు తెలిపేందుకు అతని మిత్రుడు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందులో సురేష్ రైనా మాట్లాడుతూ, ఈ పెళ్లి కుదిర్చింది తన మామ్ అని పేర్కొన్నాడు.
గత ఐదు నెలలుగా ఆస్టేలియాలో ఉన్నానని, అప్పుడే అమ్మ ఫోన్ చేసి పెళ్లి కుదిర్చిన విషయాన్ని చెప్పిందని వెల్లడించాడు.

ప్రియాంకను ఎక్కడ కలిశారు:
ఆ తర్వాత తాను ప్రియాంకతో ఫోన్‌లో మాట్లాడానని చెప్పుకొచ్చాడు. ప్రియాంక తనకి చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆయినా సరే ఎప్పుడో గానీ కలిసేవాళ్లమని తెలిపాడు. 2008లో ఓ ఎయిర్ పోర్టులో ఐదు నిమిషాలు మాట్లాడానని గుర్తు చేసుకున్నాడు.
ఆ సమయంలో ఆమె ఉద్యోగం కోసం హాలెండ్ వెళుతోందని, తాను ఐపీఎల్ మ్యాచ్ కోసం బెంగుళూరు వెళుతున్నానని చెప్పాడు. ఇక ప్రియాంక తండ్రి ఘజియాబాద్ స్కూల్లో తన స్పోర్ట్స్ టీచర్ అని, ఆమె తల్లి తన తల్లికి మంచి స్నేహితురాలని తెలిపాడు.
ఢిల్లీలో పెళ్లి చేసుకోవడానికి కారణం:
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సురేష్ రైనా ఢిల్లీలో పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఢిల్లీలో అతనికి ఎక్కువ మంది స్నేహితులు ఉండటమే. తన పెళ్లికి టీమిండియా మొత్తాన్ని ఆహ్వానించినట్లు తెలిపాడు.
ఈ పెళ్లి ఒక గెట్ టు గెదర్ లాగా ఉంటుందని పేర్కొన్నాడు. లక్నో, దుబాయ్, లండన్‌కు చెందిన అతి కొద్ది మంది స్నేహితులను కూడా ఈ వివాహనికి రానున్నట్లు తెలిపాడు.
హనీమూన్ ఎక్కడ:
పెళ్లి అనంతరం తన కెరీర్‌పై
దృష్టి పెట్టనున్నట్లు తెలిపాడు. మేమిద్దరం ఎక్కువ సమయం కలిసుండే అవకాశం లేదు. 45 రోజులు పాటు సాగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ ముగిసిన తర్వాత హనీమూన్‌కి ఇటలీలోని మిలన్‌కు వెళ్లనున్నట్లు తెలిపాడు. క్రికెటర్ల జీవితం ఎప్పుడూ క్లిష్టంగా ఉంటుంది. మ్యాచ్ షెడ్యూల్స్ నిమిత్తం ఎప్పుడూ ఏదో ఒకచోటికి ప్రయాణించాల్సి ఉంటుంది.
ప్రియాంకకు పుట్‌బాల్ అంటే ఇష్టం:
క్రికెటర్ సురేష్ రైనాకు కాబోయే జీవిత భాగస్వామికి అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియదంట. స్వయంగా ఈ విషయాన్ని రైనానే వెల్లడించాడు. తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదని, పుట్ బాల్ అంటే మాత్రం పడి చస్తుందని అన్నాడు. మెస్సీ, వాన్‌పెర్సీలకు ఆమె పెద్ద ఫ్యాన్ అని తెలిపాడు.