స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో టీమిండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన విరాట్ కొన్ని కారణాలతో తిరిగి ఇంటికి వెళ్లాడు. తొలి రెండు టెస్టులకు కోహ్లి అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ వెల్లడించింది. అయితే కోహ్లి వెళ్లిపోవడానికి కారణాలంటూ పలు కథనాలు వైరల్ అయ్యాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐతో విభేదాలు, అనుష్క శర్మ ఆనారోగ్యం వంటి కారణాలతో వెళ్లాడని నిరాధారమైన వార్తలు వచ్చాయి.
అయితే ఈ విషయంపై దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లి వెళ్లాడంటే అది మంచి కారణమే అయి ఉండొచ్చని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి ఫ్రెండ్‌షిప్ తనకి చాలా ముఖ్యమని పేర్కొన్నాడు. ''కోహ్లికి ఏమైందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అతి త్వరలో దాని గురించి మనం తెలుసుకుంటాం. వ్యక్తిగత కారణాలతో అతడు దూరమయ్యాడంటే.. అది తప్పకుండా మంచి కారణమే అయ్యి ఉంటుంది''

''అంతేగాక కోహ్లి అలసిపోయి ఉండొచ్చు. అతడు ఎంతో క్రికెట్ ఆడుతున్నాడు. అలాగే కుటుంబ విషయాలు కూడా కావొచ్చు. ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. కానీ ఆ విషయాన్ని మీకు చెప్పను. అతడి స్నేహం నాకు చాలా ముఖ్యం'' అని డివిలియర్స్ అన్నాడు. ఇటీవల కోహ్లి వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమవ్వడం ఇది మూడోసారి. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌లో కోహ్లి తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.
అలాగే దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా చిన్నవిరామం తీసుకున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా కోహ్లి లండన్‌కు వెళ్లాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. దీంతో కోహ్లి జీవితంలో ఏమైనా అలజడులు ఏర్పడి ఉంటాయని అతని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడి స్ట్రాంగ్‌గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. తన వ్యక్తిగత విషయాల్లో కోహ్లి గోప్యత పాటిస్తుంటాడనే విషయం తెలిసిందే.
కాగా, కోహ్లి, డివిలియర్స్ మధ్య ఉన్న స్నేహ బంధం గురించి క్రికెట్ ప్రేమికులకు పరిచయమే. ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున వీరిద్దరు కలిసి ఆడారు. జట్టు భారాన్ని కలిసి మోస్తూ విజయాలు అందించారు. తర్వాత ఐపీఎల్‌కు దూరమైనప్పటికీ కోహ్లితో డివిలియర్స్ టచ్‌లోనే ఉంటున్నాడు.