వరల్డ్ కప్ అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డేల సిరీస్‌లు జరిగినా క్రికెట్ అభిమానులు సంతృప్తిగా లేరు. దానికి ప్రధాన కారణం స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకపోవడమే. ఇప్పుడు వీరిద్దరు తిరిగి టీమిండియాతో చేరారు. దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలతో ఉన్నారు. కప్ ఫైనల్ ఓటమిని దిగమింగి తొలిసారి మైదానంలో అడుగుపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 26 నుంచి సెంచూరియన్ వేదికగా సఫారీ సేనతో జరిగే తొలి టెస్టుపై ఆసక్తి పెరిగింది. బలమైన సౌతాఫ్రికా పేస్ దళం నుంచి టీమిండియా బ్యాటర్లకు ప్రధాన సవాలు ఎదురు కానుంది. అలాగే మహ్మద్ షమి గాయంతో సిరీస్‌కు దూరమవ్వడం భారత్ జట్టును కలవరపెడుతోంది. పేస్ భారామంతా బుమ్రా, సిరాజ్‌పైనే ఉంది.

అయితే తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టును మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అంచనా వేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మతో యశస్వీ జైశ్వాల్ వస్తాడని, శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో ఉంటాడని తెలిపాడు. నాలుగు, అయిదు, ఆరో స్థానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వస్తారని అన్నాడు. వికెట్ కీపర్‌గా రాహుల్‌కే అవకాశం ఇస్తారని, దాంతో కేఎస్ భరత్‌కు చోటు దక్కదని చెప్పాడు.
ఇక ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా జట్టులో ఉంటారని అభిప్రాయపడ్డాడు. అయితే బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు బంతిని పంచుకోవడానికి ముకేశ్ కుమార్‌కు అవకాశం వస్తుందని అన్నాడు.
భారత్ జట్టు వివరాలు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైశ్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్,కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, బుమ్రా, ప్రసిధ్ కృష్ణ.