ముంబై: నవంబర్ 15. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ జీవితంలో మరిచిపోలేని రోజు. 1989 నవంబర్ 15న సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన రోజు. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మన లిటిల్ మాస్టర్ అరంగేట్రం చేశాడు.
తన అరంగేట్రం టెస్టు మ్యాచ్‌లో ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన సచిన్ టెండూల్కర్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాక్ ఫాస్ట్ బౌలర్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఈ టెస్టు విశేషం ఏమిటంటే భారత ఫాస్ట్ బౌలర్ సలీల్ అంకోలతో పాటు పాక్ ప్లేయర్ షాహిద్ సయీద్, బౌలర్ వకార్ యూనిస్‌లకు తొలి టెస్టు మ్యాచ్ కావడమే.

తన టెస్టు కెరీర్ ప్రారంభించేనాటికి సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులు. 24 ఏళ్ల పాటు భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టడంతో పాటు ఎన్నో రికార్డులను నెలకొల్పి చరిత్ర సృష్టించాడు. భావి యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలిచాడు.
అంతేకాదు క్రికెట్‌లో ఎన్నైతే రికార్డులున్నాయో అన్ని రికార్డులను సచిన్ తన పేరిట లిఖించాడు. ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. 200 టెస్టులాడిన సచిన్ టెండూల్కర్ 53.78 యావరేజితో 15,921 పరుగులు సాధించాడు. ఇందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి.
టెస్టు క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 248 నాటౌట్. బౌలింగ్‌లో కూడా తనదైన శైలిలో రాణించి 46 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడి రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. తన ఆటతీరు, ఒద్దికైన వ్యక్తిత్వంతో ప్రత్యర్ధుల జట్ల ఆటగాళ్లకు సైతం ఓ రోల్ మోడల్‌లా వ్యవహరించాడు.