INDvsAUS : మూడో టెస్టు వేదిక మారడం.. టీమిండియాకు కలిసొస్తుందా?

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీసులో భారత జట్టుకు ఘనమైన ఆరంభం లభించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సిరీసులో జరగాల్సిన మూడో టెస్టు వేదికను మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ధర్మశాలలో జరగాల్సిన ఈ మ్యాచ్ కోసం స్టేడియం సిద్ధంగా లేదని, అక్కడ మరమ్మతులు జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌ను ఇండోర్‌కు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల భారత్‌కు మేలు జరుగుతుందని కొందరు అంటున్నారు. అలా అనడానికి కారణాలు ఏంటంటే?

ఓటమి లేని స్టేడియం..
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం ఒక విధంగా భారత్‌కు కంచుకోట. ఈ మైదానంలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయిస్తూనే వచ్చింది. అయితే సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచులో మాత్రమే భారత్ ఓడింది. ఆ తర్వాత కానీ, అంతకుముందు కానీ ఈ స్టేడియంలో భారత్ ఒటమెరుగదు. ఇక్కడ కివీస్‌తో జరిగిన టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ ఏకంగా 13 వికెట్లతో చెలరేగడంతో న్యూజిల్యాండ్‌పై 321 పరుగుల తేడాతో ఓడించింది. అలాగే బంగ్లాదేశ్‌పై కూడా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో గెలిచింది. ఇక్కడ భారత జట్టు ఒక్కసారి కూడా ఆలౌట్ అవ్వకపోవడం గమనార్హం. ఈ రికార్డులన్నీ చూస్తుంటే మూడో టెస్టులో భారత్ విజయం ఖరారైనట్లే కనిపిస్తోంది.

ఆస్ట్రేలియాకు దెబ్బే..
ధర్మశాలలో పిచ్ నుంచి పేసర్లకు కొంత సహకారం లభించే అవకాశం ఉంది. దీంతో ఆసీస్ బౌలర్లు ఇక్కడ సత్తా చూపించే అవకాశం ఉండేది. ఇక్కడ మంచి పేస్, బౌన్స్ లభిస్తుంది. దీంతో ఆసీస్ బౌలర్లు సత్తా చాటే ఛాన్స్ ఉండేది. చివరగా ఇక్కడ ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్‌లో ప్యాట్ కమిన్స్ నాలుగు వికెట్లతో రాణించాడు. దీంతో మూడో టెస్టులో భారత జట్టును కమిన్స్ ఇబ్బంది పెట్టేవాడు. అయితే ఇక్కడి నుంచి మ్యాచ్ వేదిక మార్చడంతో ఆసీస్‌కు ఈ అడ్వాంటేజి లేకుండా పోయింది. హోల్కర్ స్టేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకు సహకారం అందిస్తుంది. దీంతో ఆసీస్ పేసర్లకు రాణించే అవకాశం లేకుండా పోయింది.

కోహ్లీ ఫామ్‌లోకి వచ్చే ఛాన్స్..
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అంత గొప్ప ఫామ్‌లో లేడు. వన్డే, టీ20ల్లో గతేడాది ఫామ్ అందుకున్న కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం ఇంకా బ్యాటు ఝుళిపించలేదు. అతను ఆడిన చివరి 21 టెస్టుల్లో 25.80 సగటుతో 929 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వీటిలో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. నాగ్‌పూర్ టెస్టులో అతను కేవలం 12 పరుగులే చేసి అరంగేట్ర స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఇక రెండో టెస్టు జరిగే ఢిల్లీలో కోహ్లీ రాణించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే అతను టెస్టుల్లో తన అత్యధిక స్కోరు చేశాడు. అయితే ఇండోర్‌లో కోహ్లీ రికార్డు చాలా గొప్పగా ఉంది. కాబట్టి మూడో టెస్టులో మాత్రం అతను మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏడేళ్ల క్రితం ఇక్కడే అజింక్య రహానేతో కలిసి 365 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లోనే తొలిసారి కోహ్లీ డబుల్ సెంచరీ సాధించాడు. మరి ఆ రోజులు గుర్తు తెచ్చుకొని మళ్లీ బ్యాటుతో కోహ్లీ ఇరగదీస్తాడేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications