
ఐపీఎల్‌లో రెండు సార్లు టైటిల్ నెగ్గిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గాయంతో ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో జట్టు పగ్గాలు ఎవరికి దక్కుతాయా? అని తెగ చర్చ జరిగింది. దీనికి తెరదించిన కేకేఆర్ యాజమాన్యం.. ఎవరూ ఊహించని విధంగా నితీష్ రాణాను కెప్టెన్ చేసింది. ఇది చూసిన చాలా మంది అభిమానులు షాక్ అయ్యారు. అతనికి ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారో అర్థం చేసుకోలేకపోయారు. అతని కన్నా అర్హులైన వాళ్లు జట్టులో ఉన్నారని చెప్తున్నారు. వాళ్లెవరంటే..
ఆండ్రీ రస్సెల్
విండీస్ విధ్వంసకారుడు ఆండ్రీ రస్సెల్ 2014 నుంచి ఈ ఫ్రాంచైజీతో కలిసి ఉన్నాడు. ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, యాజమాన్యం అందరితోనూ రస్సెల్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. దానికితోడు కరీబియాన్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లలో కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా రస్సెల్‌కు ఉంది. ఫామ్‌లో ఉంటే రస్సెల్‌ను తట్టుకోవడం ఏ జట్టుకైనా కష్టమే. అలాంటి ఆటగాడిని కెప్టెన్ చేస్తే.. జట్టును ముందుండి నడిపించే వాడు అని అభిమానులు చెప్తున్నారు.
టిమ్ సౌథీ
కివిస్ సీనియర్ పేసర్ టిమ్ సౌథీ కూడా కేకేఆర్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. చాలా మంది అతన్ని కెప్టెన్సీ ఆప్షన్‌గా పట్టించుకోకపోవచ్చు. ఇటీవలే కేన్ విలియమ్సన్ స్థానంలో న్యూజిల్యాండ్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా సౌథీని నియమించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన క్రికెట్ బ్రెయిన్ ఉన్న సౌథీ.. కివీస్‌కు 22 టీ20ల్లో కెప్టెన్సీ చేశాడు. వీటిలో 13 మ్యాచుల్లో ఆ జట్టు విజయం సాధించింది. ఎప్పుడూ కామ్‌గా ఉండే సౌథీ కెప్టెన్సీ.. కోచ్ చంద్రకాంత్ పండిట్ స్టైల్‌కు చాలా దగ్గరగా ఉండటం కూడా గమనార్హం.
సునీల్ నరైన్
కేకేఆర్ రెండుసార్లు టైటిల్ నెగ్గడంలో నరైన్‌ది చాలా కీలకపాత్ర. చాలా కాలంగా జట్టుతో కలిసి ఉన్న అతనికే కెప్టెన్సీ అందుతుందని అంతా అనుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా టీ20 లీగుల్లో ఆడిన అనుభవం నరైన్‌కు ఉంది. ఇటీవల ముగిసిన ఐఎల్‌టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్‌కు కెప్టెన్ వ్యవహరించాడు. ఈ లీగ్‌లో ఈ టీం చాలా చెత్త ప్రదర్శన చేసింది. కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కానీ అనుభవం దృష్ట్యా నరైన్‌కు పగ్గాలు అందించి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం. ప్రస్తుతం కేకేఆర్ ఒక నిర్ణయానికి వచ్చేయడంతో రాణా ఏం చేస్తాడో చూడాలి.