
సూర్యకుమార్ యాదవ్
టెస్టు క్రికెట్‌లో టీమిండియా మిడిలార్డర్‌లో రిషభ్ పంత్ చాలా కీలకం. అతను ధనా ధన్ ఆటతో జట్టుకు కీలకమైన విజయాలు అందించాడు. అతని స్థానాన్ని భర్తీ చేస్తాడనే ఆశతో సూర్యకుమార్‌ను తొలి టెస్టులో ఆడించారు. కానీ అతను దారుణంగా ఫెయిలయ్యాడు. కేవలం 8 పరుగులే చేసి లియాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతని కన్నా గిల్‌ను ఆడిస్తే బాగుండేదని కొందరు అంటున్నారు. కానీ రెండో టెస్టులో కూడా సూర్యనే ఆడించే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో కూడా ఫెయిలైతే అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు గిల్, సర్ఫరాజ్ వంటి వాళ్లు రెడీగా ఉన్నారు.

కేఎల్ రాహుల్
సూపర్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని, కేవలం సీనియర్ బ్యాటర్ అనే కారణంతో కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అతను తొలి టెస్టులో అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించలేకపోయాడు. కేవలం 20 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గిల్ వంటి ఆటగాడిని కాదని రాహుల్‌ను అసలు ఎందుకు ఆడిస్తున్నారని మాజీ దిగ్గజం వెంకటేశ్ ప్రసాద్ వంటి వాళ్లు ఘాటుగానే విమర్శిస్తున్నారు. అతను కనుక రెండో టెస్టులో కూడా ఫెయిలైతే.. ఆ తర్వాతి రెండు మ్యాచుల్లో గిల్‌ను ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ
శ్రీలంక సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లీ.. మళ్లీ ఫామ్ అందుకున్నాడనే అంతా అనుకున్నారు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం అతని ఫామ్ ఏమాత్రం మెరుగవలేదు. బంగ్లా టెస్టుల్లో ఫెయిలైనట్లే ఆసీస్‌పై కూడా కోహ్లీ ఫెయిలయ్యాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో స్పిన్‌ను ఎదుర్కొనేందుకు నానాతిప్పలు పడుతున్నాడు. అరంగేట్ర ఆటగాడు టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. మూడేళ్లుగా టెస్టుల్లో రాణించని కోహ్లీ ఇలాగే విఫలమైతే అతన్ని టెస్టు జట్టు నుంచి తప్పించినా ఆశ్చర్యం లేదని మాజీలు అంటున్నారు. రాహుల్‌తోపాటు కోహ్లీని కూడా జట్టులో నుంచి తీసేయాలని కొందరు నెటిజన్లు ఇప్పటికే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు.


Click it and Unblock the Notifications
