INDvsNZ : ఈ రికార్డులపై కన్నేసిన టీమిండియా.. కివీస్ సిరీస్‌లో బద్దలవడం గ్యారంటీ!

శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు.. న్యూజిల్యాండ్‌ను కూడా చిత్తు చేయాలని తహతహలాడుతోంది. హైదరాబాద్ వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రాయ్‌పూర్, ఇండోర్‌లో మిగతా రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్ గెలవడమే కాదు.. ఈ క్రమంలో కొన్ని అరుదైన రికార్డులు కూడా బద్దలు కొట్టేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. అవేంటంటే..

షమీ ఈసారైనా..
శ్రీలంకతో మూడు వన్డేల్లోనూ ఆడిన వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ అంత గొప్పగా రాణించలేదు. ఆ సిరీస్ ప్రారంభం అయ్యే ముందు కూడా అతను అరుదైన రికార్డుకు చేరువలోనే నిలిచాడు. ఆ సిరీస్‌లో కనీసం ఆరు వికెట్లు తీసుకొని ఉంటే వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆల్‌టైం బౌలర్ల జాబితాలో టాప్ టెన్‌లోకి చేరే వాడు. కానీ అది జరగలేదు. ఆ అవకాశం ఇప్పుడు షమీ ముందు నిలిచింది. ప్రస్తుతం 82 వన్డేల్లో 152 వికెట్లతో ఉన్న షమీ.. ఈ సిరీస్‌లో మూడు వికెట్లు తీసుకుంటే చాలు. భారత్ తరఫున అత్యధిక వన్డే వికెట్లు తీసుకున్న బౌలర్‌గా మనోజ్ ప్రభాకర్ (157 వికెట్లు)ను దాటేసి పదో స్థానంలో నిలుస్తాడు. ప్రస్తుతం షమీ 11వ ర్యాంకులో ఉన్నాడు.

గిల్ మరో రికార్డు
శ్రీలంకపై రాణించిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా కివీస్ సిరీస్‌లో మరో రికార్డుపై కన్నేశాడు. శ్రీలంకపై ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న అతను.. వన్డేల్లో 20 ఇన్నింగ్స్‌ల తర్వాత భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం గిల్ 18 వన్డేల్లో 894 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్‌లో కనుక అతను 106 పరుగులు చేస్తే భారత్ తరఫున అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన వన్డే బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం అతను ఉన్న ఫామ్ చూస్తుంటే తొలి వన్డేలోనే ఈ రికార్డు బద్దలు కొట్టేలా ఉన్నాడు.

కోహ్లీ మరో మైలురాయి
ఇటీవల ముగిసిన లంక సిరీస్‌లో టాప్ పెర్ఫామర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. రెండు శతకాలతో అద్భుతంగా రాణించిన అతను.. ఈ క్రమంలో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. లంక లెజెండ్ మహేల జయవర్దనేను వెనక్కు నెట్టాడు. ఇప్పుడు అతని ముందు మరో మైలురాయి నిలిచింది. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ 259 ఇన్నింగ్స్‌లలో 12,754 పరుగులు చేశాడు. అంటే కివీస్ సిరీస్‌లో కనుక అతను మరో 246 పరుగులు చేస్తే.. వన్డేల్లో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. వన్డే చరిత్రలో ఈ ఘనత ఇప్పటి వరకు కేవలం నలుగురే సాధించారు. ఇప్పుడు ఈ జాబితాలో కోహ్లీ పేరు కూడా చేరనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications