IPL 2023 : వచ్చే ఏడాది ఐపీఎల్‌లో.. వీళ్లందరూ విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ సంపాదిస్తారు తెలుసా?

భారత క్రికెట్‌లో బాగా సంపాదించే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. అత్యుత్తమ బ్యాటర్లలలో ఒకడైన అతనికి ఐపీఎల్‌లో భారీగానే డబ్బు దొరుకుతోంది. ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తోనే ఉన్న కోహ్లీకి 2018-2021 వరకు ఏటా రూ.17 కోట్లు ఫీజు దక్కేది. అయితే గతేడాది తన ఫీజును రూ.15 కోట్లకు కోహ్లీ తగ్గించుకున్నాడు. అదే సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో రూ.17 కోట్ల ఒప్పందం చేసుకున్న కేఎల్ రాహుల్.. ఐపీఎల్‌లో టాప్ సంపాదనాపరుడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈసారి మినీ వేలంలో మరికొందరు ఆటగాళ్లు కోహ్లీ కన్నా పెద్ద డీల్స్ దక్కించుకున్నారు. వాళ్లెవరో ఒకసారి చూస్తే..

శామ్ కర్రాన్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రాన్ కోసం మినీ వేలంలో గట్టి పోటీ నెలకొంది. అతన్ని కొనుగోలు చేయడానికి బడా ఫ్రాంచైజీలన్నీ ప్రయత్నించాయి. చివరకు రూ.18.5 కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా కూడా కర్రాన్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమైన కర్రాన్.. అంతకుముందు అంటే 2021లో అతని శాలరీ రూ.5.5 కోట్లు కావడం గమనార్హం.

కామెరూన్ గ్రీన్
ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా ఈసారి భారీ ధర పలికాడు. తొలిసారి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న అతన్ని ముంబై ఇండియన్స్ జట్టు రూ.17.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవల రిటైర్ అయిన కీరన్ పొలార్డ్ స్థానాన్ని అతనితో భర్తీ చేయాలని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

కేఎల్ రాహుల్
ఇంతకుముందే చెప్పినట్లు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు.. గతేడాది రాహుల్‌తో రూ.17 కోట్లకు ఒప్పందం చేసుకుంది. దీంతో అతను కోహ్లీని దాటేశాడు. గత సీజన్‌లో లక్నో సారధిగా ఆకట్టుకున్న రాహుల్.. ఆ జట్టును ఎలిమినేటర్ వరకూ తీసుకెళ్లాడు. కానీ బెంగళూరు చేతిలో ఓడిపోవడంతో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

బెన్ స్టోక్స్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కోసం కూడా మినీ వేలంలో గట్టి పోటీ నెలకొంది. అయితే చివరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతన్ని రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఉన్న చెన్నై జట్టు.. స్టోక్స్ చేరికతో మరింత బలంగా మారిందని అభిమానులు భావిస్తున్నారు.

నికోలస్ పూరన్
గతేడాది సన్‌రైజర్స్ తరఫున పేలవ ప్రదర్శన చేసిన పూరన్‌ను ఆ ఫ్రాంచైజీ విడుదల చేసింది. అయితే బ్యాటుతో రెచ్చిపోయే సత్తా ఉన్న పూరన్ కోసం మినీ వేలంలో ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీ పడ్డాయి. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు అతన్ని రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది.

రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ శాలరీ కూడా కోహ్లీ కన్నా ఎక్కువే. అతన్ని ముంబై జట్టు రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది. గతేడాది చాలా చెత్త ప్రదర్శన చేసిన ముంబై జట్టు.. ఈసారి ఎలాగైనా మంచి ప్రదర్శనతో ట్రోఫీ నెగ్గాలని ప్రయత్నిస్తోంది. రోహిత్ కూడా గతేడాది పెద్దగా రాణించలేదు. ఈసారి ఎలాగైనా తను కూడా రాణించాలని ఆశ పడుతున్నాడు.

రవీంద్ర జడేజా
చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా గతేడాది విఫలమైన రవీంద్ర జడేజా కూడా భారీ జీతం తీసుకుంటున్నాడు. చెన్నై ఫ్రాంచైజీ అతన్ని రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే మినీ వేలానికి ముందు జడ్డూను చెన్నై రిలీజ్ చేసేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో నిజం లేదని ఆ ఫ్రాంచైజీ యాజమాన్యం కొట్టిపారేసింది.

ఇషాన్ కిషన్
గతేడాది మెగా వేలంలో అందరికీ షాకిస్తూ ఇషాన్ కిషన్ కోసం ముంబై యాజమాన్యం రూ.15.25 కోట్లు ఖర్చు పెట్టింది. యువ ప్లేయర్ అంత భారీ ధర పలకడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే తన ధరకు కిషన్ గతేడాది న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న అతను.. ముంబైకి మంచి ఆరంభాలు ఇవ్వడంపై కాన్‌సన్‌ట్రేట్ చేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications