విరాట్ కోహ్లికి 2023 గొప్పగా కలిసొచ్చింది. తన మునపటి సూపర్ ఫామ్‌ను అందుకున్నాడు. పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలుకొట్టాడు. వన్డేల్లో అత్యుతమ సెంచరీల సచిన్ టెండూల్కర్ (49) రికార్డును కోహ్లి అధిగమించి చరిత్ర సృష్టించాడు . అంతేగాక ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో 765 పరుగులు చేసిన విరాట్ ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. మరోవైపు ఏడు భిన్నమైన క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయ క్రికెట్‌లో 2000కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లి చరిత్ర లిఖించాడు.
అయితే కొత్త ఏడాదిలో కోహ్లిని మరికొన్నిరికార్డులు ఊరిస్తున్నాయి. సచిన్ రికార్డులు కొన్ని బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024లో టీమిండియాకు ఉన్న షెడ్యూల్‌ను బట్టి కోహ్లి ఏడు రికార్డులకు అతి చేరువలో ఉన్నాడు.

1. వన్డేల్లో 14వేల పరుగుల మార్క్‌ను అందుకోవడానికి కోహ్లి 152 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే ఈ మార్క్‌ను వేగంగా అందుకున్న ప్లేయర్‌గా కోహ్లి చరిత్రలో నిలవనున్నాడు. సచిన్ ఈ ఘనతను 350 మ్యాచ్‌ల్లో అందుకోగా ఇప్పటివరకు 292 వన్డేలు ఆడిన కోహ్లి 14797 పరుగులు చేశాడు. అయితే ఈ ఏడాదిలో భారత్ కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. అది కూడా లంకతో శ్రీలంకలో ఆడనుంది. ఆ సిరీస్‌కు కోహ్లిని ఎంపిక చేస్తే 14వేల పరుగుల వేగవంతమైన రికార్డు బద్దలైనట్లే.
2. టీ20 క్రికెట్‌లో కోహ్లి మరో 35 పరుగులు చేస్తే పొట్టి ఫార్మాట్‌లో 12వేల పరుగుల మార్క్‌ను అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలుస్తాడు. ఈ ఏడాది అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈ రికార్డు నమోదవ్వడం పక్కా.
3. స్వదేశంలో జనవరి 25 నుంచి ఇంగ్లాండ్‌తో భారత్ అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్‌గా నిలవడానికి కోహ్లికి మరో 544 పరుగులు అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (2535) పేరిట ఉంది.
4. స్వదేశంలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించడానికి కోహ్లికి మరో అయిదు సెంచరీలు అవసరం. ఈ రికార్డు సచిన్ (42) పేరిట ఉంది. అయితే ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో టెస్టు సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి ఈ ఘనత అందుకునే ఛాన్స్ ఉంది.
5. వెస్టిండీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పడానికి కోహ్లికి మరో 322 పరుగులు అవసరం. ఈ రికార్డు రాహుల్ ద్రవిడ్ (1919) పేరిట ఉంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తుంది.
6.న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన ఇండియన్ ప్లేయర్‌గా నిలవడానికి కోహ్లికి మరో సెంచరీ అవసరం. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (9) పేరిట ఉంది.
7. బంగ్లాదేశ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగుల సాధించిన టీమిండియా ప్లేయర్ రికార్డుకు కోహ్లి మరో 383 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు కూడా సచిన్ (820) పేరిట ఉంది.