భారత క్రికెట్ కు ఈ సంవత్సరం మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ సంవత్సరంలోనే భారత్ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలోనే ఇండియాకు బిగ్ హిట్టర్లు దొరికారు. ఈ ఏడాది T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లను చాలానే ఉన్నారు. ఇందులో సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఉన్నారు.
టీ20 ఫార్మాట్ లో సంజు శాంసన్ కు మంచి రికార్డు ఉంది. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెడ్డాడు. సంజు 13 మ్యాచ్‌ల్లో 180 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 436 పరుగులు చేశాడు. శాంసన్ ఈ సంవత్సరం రెండు సెంచరీలు చేశాడు. 31 సిక్సర్లు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా మంచి ప్రతిభ కనబరిచాడు. భారత T20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. సూర్య 18 మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధ సెంచరీలతో సహా 429 పరుగులు చేశాడు. 22 సిక్సర్లు కొట్టాడు. అయితే అతను ఈ ఏడాది ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

టీ20 వరల్డ్ కప్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అయినప్పటికీ అతను ఈ సంవత్సరం ఆడిన మ్యాచ్ ల్లోతనదైన ముద్ర వేశాడు. రోహిత్ 11 మ్యాచ్‌లలో 378 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. డైనమిక్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య 17 మ్యాచ్‌లలో 352 పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. పాండ్యా ఈ సంవత్సరం 19 సిక్సర్లు కొట్టాడు. బంతితో కూడా రాణించాడు.
తిలక్ వర్మ ఈ సంవత్సరం మెరిశాడు. దక్షిణాఫ్రికాలో బ్యాక్-టు-బ్యాక్ సెంచరీలతో చెలరేగిపోయాడు. కేవలం ఐదు మ్యాచ్‌ల్లో అతను 306 పరుగులు సాధించాడు. టీ20లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా చెప్పుకొదగ్గ ఇన్నింగ్స్ లు ఆడినప్పటికీ.. కీలక సమయంలో భారత్ కు అండగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.