నాలుగో నంబరుపై అనుమానాలొద్దు.. ఆ స్థానం నా సొంతమైనట్లే: శ్రేయస్ అయ్యర్

ఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం తనదే అనుకుంటున్నానని యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. నాలుగో నంబరుపై అనుమానాలొద్దు, ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తున్న తాను ఆ స్థానంను సొంతం చేసుకున్నట్లేనని ధీమా వ్యక్తం చేశాడు. గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు అంతకుముందు వెస్టిండీస్ సిరీస్‌లోనూ అయ్యర్ అంచనాలకు మించి రాణించాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌లో ఓ సెంచరీ సహా రెండు అర్ధ సెంచరీలతో 217 పరుగులు బాదాడు.

4 నా సొంతమైనట్లే:
సోమవారం ఐపీఎల్ ప్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ షోలో శ్రేయాస్ అయ్యర్ పాల్గొని పలు అంశాలు అభిమానులతో పంచుకున్నాడు. 'భారత్ తరఫున ఏడాదిగా ఒక స్థానంలో స్థిరంగా ఆడుతున్నామంటే.. ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నట్లే. దాని గురించి ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబరు గురించి చర్చ నడిచినప్పుడు ఆ స్థానంలో దిగి నన్ను నేను నిరూపించుకోవడం సంతృప్తిగా ఉంది. కానీ టీమిండియాకు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడేందుకు సిద్ధంగా ఉండాలి.. పరిస్థితిని బట్టి ఏ స్థానంలోనైనా ఆడగలను' అని అయ్యర్ తెలిపాడు.

కోహ్లీ సింహం లాంటోడు:
ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీపై యువ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. 'యువ క్రికెటర్లకు కెప్టెన్ కోహ్లీ రోల్ మోడల్. జట్టులో అతడో సింహం లాంటోడు. ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు అతని శరీర భాషే చాలా భిన్నంగా ఉంటుంది. మైదానంలోకి అడుగుపెట్టాడంటే మొదటి మ్యాచ్‌లాగే ఫీలవుతాడు. అసలు అలసిపోడు. సింహం లాగా ఎప్పుడు బలంగా కనిపిస్తాడు. అతడి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని అయ్యర్ పేర్కొన్నాడు.

అనూహ్యంగా శంకర్‌కు అవకాశం:
క్రికెట్ జట్టులో నాలుగో స్థానం చాలా కీలకం. అయితే భారత జట్టులో మాత్రం ఇటీవల ఈ స్థానం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్థానం కోసం మొదటగా ఎందరినో పరిశీలించగా.. అంబటి రాయుడు పర్వాలేదనిపించాడు. అయితే అనూహ్యంగా 2019 ప్రపంచకప్ టోర్నీకి విజయ్ శంకర్‌ను నాలుగో స్థానానికి ఎంపిక చేశారు. టోర్నీ మొత్తం రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీలు రాణించడంతో నాలుగో నెంబరుపై అంత ప్రభావం పడలేదు. కానీ.. విజయ్ బ్యాటింగ్ వచ్చినప్పటికీ పెద్ద స్కోర్లేమీ చేయలేకపోయాడు.

నాలుగు కోసం అయ్యర్:
అత్యంత కీలకమైన సెమీ ఫైనల్‌లో మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్లు రోహిత్, రాహుల్, కోహ్లీ త్వరగా పెవిలియన్‌కు చేరడంతో భారం నాలుగో నెంబరుపై పడింది. ఆ మ్యాచ్‌లో ఆడిన ఆటగాడు ఏమాత్రం నిలదొక్కుకోలేకపోవడంతో భారత్ టోర్నీ నుంచి వెనుదిరగవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ తర్వాత బీసీసీఐ సెలక్షన్ బోర్డు నాలుగో నెంబరు కోసం శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది. అయ్యర్ అద్భుత ప్రతిభతో నిరూపించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications