తప్పు చేశారు, చెడ్డవారు కాదు, రెండో అవకాశం ఇవ్వండి: బాల్ టాంపరింగ్‌పై కోచ్ లీమన్

హైదరాబాద్: 'స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను' ఈ మాటలన్నది ఎవరో కాదు ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్ డారెన్ లీమన్. యావత్ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ ఘటనపై ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లీమన్ ఎట్టకేలకు స్పందించాడు.
బాల్ టాంపరింగ్‌కు పాల్పడి దేశం పరువు తీసిన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) చర్యలు తీసుకున్న అనంతరం డారెన్ లీమన్ మీడియాతో మాట్లాడుతూ 'ఎంతోమంది అభిమానుల నమ్మకాన్ని వమ్ము చేశాం. నా మనసు లోతుల్లోంచి వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. నేను ఆ ముగ్గురి మానసిక పరిస్థితి గురించే (స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్) ఆందోళన చెందుతున్నాను' అని అన్నాడు.
'ప్రస్తుతం మేము ఆడుతున్న తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ అభిమానుల మద్దతు, అభిమానం సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్ తీవ్రమైన తప్పిదమే చేశారు. అయితే వాళ్లు చెడ్డవాళ్లు మాత్రం కాదు. అభిమానులు వారికి రెండో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను' అని లీమన్ ఆసీస్ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం
కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) కొరడా ఝులిపించింది. బాల్ టాంపరింగ్ వివాదంలో కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఇక, బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించిన కామెరాన్ బాన్‌క్టాఫ్ట్‌పై తొమిది నెలల నిషేధం విధించింది. దీంతో పాటు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆస్ట్రేలియాకు రెండేళ్ల పాటు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా కూడా నిషేధం విధిస్తూ సీఏ సీఈఓ జేమ్స్ సదర్లాండ్ బుధవారం ప్రకటన వెలువరించాడు.

మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశం
క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధంపై ఈ ముగ్గురు ఆటగాళ్లు మరోసారి అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే, బంతి ఆకారాన్ని మార్చేందుకు టేప్‌ను కాకుండా సాండ్‌పేపర్‌ను (గరుకైన కాగితాన్ని) ఉపయోగించినట్టు తమ విచారణలో తేలినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ ముగ్గురు ఆటగాళ్లను దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా ఇంటికి పంపించివేసింది. వీరి స్థానంలో నాలుగో టెస్టు కోసం రెన్‌షా, గ్లెన్ మాక్స్‌వెల్, జో బర్న్స్‌లు దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్లు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌ల్లో ఏడాది పాటు ఆడకూడదు.

క్లబ్ క్రికెట్ ఆడేందుకు అనుమతి
అయితే వీరు క్రికెట్‌ను కొనసాగించేందుకు క్లబ్ క్రికెట్ మాత్రం ఆడొచ్చు. అంతేకాదు శిక్ష అమలు కాలంలో ఈ ముగ్గురూ కమ్యూనిటీ క్రికెట్‌లో వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని కూడా ఆదేశించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చేసిన మరో ప్రకటన డేవిడ్ వార్నర్ భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. నిషేధ సమయంలో స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌ను క్లబ్ క్రికెట్‌లోనూ నాయకత్వ బాధ్యతలు స్వీకరించేందుకు అర్హులు కాదని పేర్కొంది. డేవిడ్ వార్నర్ మాత్రం ఎప్పటికీ కెప్టెన్సీ చేపట్టే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా తేల్చి చెప్పింది.

వార్నర్ ఎన్నటికీ కెప్టెన్ కాలేడు
భవిష్యత్‌లో ఒకవేళ వార్నర్‌ను కెప్టెన్సీకి పరిగణించాలంటే అభిమానులు, దేశ ప్రజలు, క్రికెట్ అధికారుల మద్దతు ఉంటేనే అది సాధ్యపడుతుందని కూడా పేర్కొంది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి జరుగబోయే నాలుగో టెస్టుకు ఈ ముగ్గురి స్థానంలో రెన్‌షా, బర్న్స్, మ్యాక్స్‌వెల్ జట్టులో చేరారు. స్టీవ్ స్మిత్ స్థానంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్‌గా టిమ్ పైనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.

స్టీవ్ స్మిత్‌పై నమోదైన అభియోగాలు ఇవే..
క్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.3.5ని ఉల్లంఘించి.. స్మిత్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ముందస్తు ప్రణాళిక రచించడం, నీతిమాలిన చర్యను అడ్డుకోవడంలో విఫలమవడం, ప్రణాళికను అమలు పరచడం, మ్యాచ్ అధికారులతో పాటు బాన్‌క్రాఫ్ట్‌ను తప్పు దోవ పట్టించడం, మైదానంలో ఆటకు విఘాతం కలిగించేలా టాంపరింగ్ చేయించడం పై సాక్షాధ్యారలు ఉండటం వల్ల పాత్రదారులైన ముగ్గురికీ శిక్ష విధించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications