వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం తప్పదు: రణతుంగ

హైదరాబాద్: ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక జట్టుకు ఘోర పరాభవం తప్పదని మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ హెచ్చరించారు. బోర్డు అధికారుల్లో అవినీతి ఎక్కువైందని.. ఆటగాళ్లలో క్రమశిక్షణ కొరవడిందని... ఈ మెగా ఈవెంట్‌లో లంక తొలి రౌండ్ దాటడం కూడా కష్టమేనని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది.

రణతుంగ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో లంక మాజీ కెప్టెన్ అయిన అర్జున రణతుంగ మాట్లాడుతూ "బోర్డులో అవినీతి జరుగుతోంది. ఆటగాళ్లలో బృంద స్ఫూర్తి కొరవడింది. క్రికెటర్లు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణాలతో ఐసీసీ వరుసగా దర్యాప్తులు చేస్తోంది" అని అన్నారు.

జట్టు పేలవ ప్రదర్శనకు
ప్రస్తుతం జట్టు పేలవ ప్రదర్శనకు బోర్డుతో పాటు కొంత మంది ఆటగాళ్లే కారణమని పరోక్షంగా ఆయన తెలిపారు. ఆటగాళ్లలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే వరల్డ్ కప్‌లో లీగ్‌దశలోనే శ్రీలంక వెనుదిరిగి వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

ప్రేరణ పెంపొందించి మానసికంగా
ఏదేమైనప్పటికీ జట్టులో ప్రేరణ పెంపొందించి మానసికంగా బలవంతులను మార్చేందుకు శిక్షణ ఇవ్వాలని రణతుంగ సూచించారు. కొంతమంది ఆటగాళ్లు దేశం కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం ఆడుతున్నారని విమర్శించారు. అలాంటి వారిని వెంటనే తరిమి కొట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో
శ్రీలంక టీ20 కెప్టెన్ లసిత్ మలింగ, తాత్కాలిక కెప్టెన్ తిసారీ పెరీరా సోషల్ మీడియాలో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడంతో రణతుంగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీలంక బోర్డు వీరిని హెచ్చరించినా మారకపోవడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న రణతుంగ క్రికెట్ బోర్డు పగ్గాలు చేపట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications