
ఆసియాకప్ - 2022 టోర్నీలో సూపర్ 4 దశలోనే భారత్ నిష్క్రమించడం భారత అభిమానులతో పాటు కూసింత ప్రపంచ జట్లను కూడా ఆశ్చర్యపరిచింది. ఆసియా కప్ టోర్నీ గెలుపొందే విషయంలో ఫేవరెట్‌గా ఇండియా అడుగుపెట్టి.. సూపర్ 4 దశలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడి టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌లో మెరుగ్గా రాణించగల క్వాలిటీ, స్కిల్స్ ఉన్న ప్లేయర్లను టీమిండియా కలిగి ఉందని శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే కొన్ని విభాగాల్లో టీమిండియా కాస్త పొరపాట్లను సరి చేసుకోవాల్సిన అవసరముందన్నాడు. ప్రతిభ, నైపుణ్యం ఉన్నప్పటికీ అన్ని రంగాల్లోనూ భారత్ సత్తా చాటాలని జయవర్ధనే సూచించాడు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడమే ఆసియా కప్‌లో భారత్ పతనానికి పెద్ద కారణమని జయవర్ధనే తెలిపాడు. ఇకపోతే జస్ప్రీత్ బుమ్రా ఎల్లుండి నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు తిరిగి అందుబాటులోకి రాబోతున్నాడు.
కొత్త బంతితో అలాగే డెత్ బౌలింగ్లో బుమ్రా చెలరేగే విధానం అమోఘమని.. అతను తిరిగి జట్టులోకి రావడంతో జట్టులో పెద్ద శూన్యతను పూరించాడని మహేలా పేర్కొన్నాడు. 'భారత జట్టు నైపుణ్యాలు, ప్రతిభ అన్నీ అద్భుతం. అయితే ఆ జట్టుకు బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో కొంచెం ఆత్మవిశ్వాసం అవసరం. సహజంగానే జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం కూడా జట్టు ఆసియాకప్ కోల్పోవడానికి కారణం. అతను కొత్త బంతితో చెలరేగుతాడు. అలాగే డెత్ ఓవర్లలో జట్టులో అవసరమైన గ్యాప్‌ని పూరిస్తాడు. బుమ్రా వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు అది ఆ జట్టుకు పెద్ద విలువను జోడిస్తుంది' అని జయవర్దనే తెలిపాడు. ఆసియాకప్‌లో విరాట్ కోహ్లీ మళ్లీ తన ఫామ్‌ను కనుగొనడం పట్ల ప్రశంసలు కురిపించాడు. భారత్‌కు ఇప్పుడు జట్టు లైనప్‌లో స్థిరత్వం ఉందని, జట్టులో ఫామ్‌లో ఉన్న కోహ్లీ ఉండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అతను అభిప్రాయపడ్డాడు.