
న్యూఢిల్లీ: వేలి గాయంతో ప్రపంచకప్ టోర్నమెంట్ నుంచి భారత క్రికెట్ జట్టు డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ అర్ధాంతరంగా వైదొలగడం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కూడా బాధ పెట్టినట్టుంది. కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు, ప్రేమికుల తరహాలోనే ఆయన కూడా శిఖర్ ధావన్‌కు తన మద్దతును తెలిపారు. త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. శిఖర్ ధావన్ పోస్ట్ చేసిన వీడియోను చూసిన అనంతరం మోడీ ఈ ట్వీట్ చేశారు.
పిచ్ మిమ్మల్ని మిస్ చేసుకుంది..
డియర్ శిఖర్ ధావన్! క్రికెట్ పిచ్ మిమ్మల్ని మిస్ చేసుకుంది.. అని అంటూ ఆయన తన ట్వీట్‌ను మొదలు పెట్టారు. త్వరలోనే కోలుకుంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోసారి జట్టులోకి పునఃప్రవేశించి, జట్టు, దేశానికి విజయాలను సాధించి పెట్టాలని ఆశిస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు. అంతకుముందు- సచిన్ టెండుల్కర్ కూడా శిఖర్ ధావన్ గాయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.