ఐపీఎల్‌లో రోహిత్ శర్మ అత్యంత ప్రమాదకర బ్యాటర్ అని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. రోహిత్ కోసం ప్లాన్-ఏ, ప్లాన్-బీ తో పాటు ప్లాన్-సీ కూడా వేయాల్సిన పరిస్థితులు ఉంటాయని పేర్కొన్నాడు. ఇటీవల గంభీర్ తిరిగి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు గూటికి చేరిన విషయం తెలిసిందే. కేకేఆర్‌కు మెంటార్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2012, 2014 సీజన్లలో కోల్‌కతా జట్టును గంభీర్ విజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు సీజన్లకు గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా ఉన్నాడు.
''నాకు నిద్రలేని రాత్రుళ్లు మిగిలిచ్చిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ వంటి ఇతర క్రికెటర్లు గురింది ఆందోళన చెందలేదు. రోహిత్ కోసం ప్లాన్-ఏ, ప్లాన్- బీ వేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు ప్లాన్-సీ కూడా వేయాలి. అతడు బరిలో ఉంటే పరిస్థితులు భిన్నంగా మారతాయి. రోహిత్ ప్రత్యేకమైన సవాలు. అతడి కోసం ఎన్నో వ్యూహాలు వేయాల్సి వచ్చేది. ఐపీఎల్ రోహిత్ శర్మ ఒక్కడే నన్ను భయపెట్టాడు. అతడి కోసం ప్రణాళికలు రచించినట్లుగా మరే ఇతర ఆటగాడు కోసం చేయలేదు''

''ఇతర ఆటగాళ్ల కోసం ప్లాన్-ఏ సరిపోతుంది. కానీ రోహిత్ శర్మకి అలా సాధ్యం కాదు. మ్యాచ్ ముందు రోజు రాత్రి ఇలా ఆలోచించేవాడిని.. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఎలా, మరొకటి సిద్ధం చేయాలి! సునీల్ నరైన్ తన నాలుగు ఓవర్లు ముగిస్తాడు. మరి, మిగిలిన 16 ఓవర్ల సంగతేంటి? ఒకవేళ నరైన్ నాలుగు ఓవర్ల కోటా ముగిశాక రోహిత్ ఇంకా క్రీజులో ఉంటే ఏం చేయాలి? అతడు ఒకే ఓవర్‌లో 30 పరుగులు సాధించగలడు. రోహిత్ వల్ల ఎక్కువ ఆందోళన చెందా'' అని గంభీర్ తన అనుభవాలు పంచుకున్నాడు.
కాగా, ముంబయి ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అయిదు టైటిళ్లు అందించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ముంబయి రోహిత్‌ను కాదని కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించింది. గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ ఫైనల్స్‌కు చేర్చాడు. అంతేగాక 2022లో విజేతగా నిలిపాడు. దీంతో హార్దిక్‌ను ట్రేడింగ్‌లో ముంబయి సొంతం చేసుకుంది.