
ఓ డైరీలో పనికి కుదిరిన యశస్వి జైస్వాల్
ఉత్తర ప్రదేశ్ నుంచి ముంబైకి చేరుకున్న యశస్వి జైస్వాల్ ఓ డైరీలో పనికి కుదిరి స్థానికంగా క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. అయితే రోజంతా ఆడి అలసి రాత్రి వేళ పడుకోవడంతో.. పడుకోవడానికే డైరీకి వస్తున్నాడంటూ అతన్ని కొన్నిరోజుల తర్వాత పని నుంచి తప్పించారు. అదే సమయంలో ముంబైలోని వర్లీలో ఉండే అతని మామ సంతోష్ అక్కడే ఉండే ఆజాద్ మైదానంలోని ముస్లిమ్ యునైటెడ్ క్లబ్ వాళ్ల గుడారాల్లో ఉండే ఏర్పాటు చేశాడు.

మూడేళ్ల పాటు ముస్లిమ్ యునైటెడ్ క్లబ్‌లో
యశస్వి జైస్వాల్ మామ ముస్లిమ్ యునైటెడ్ క్లబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తుండటంతో ఆయన అడగటంతో అందుకు వారు అంగీకరించారు. మూడేళ్ల పాటు జైశ్వాల్ అక్కడే ఉన్నాడు. ఎన్ని కష్టాలు పడినప్పటికీ ఆ విషయాలను ఇంట్లో వాళ్లకు మాత్రం చెప్పలేదు. ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఇక క్రికెట్ ఆడింది చాలు, ఉత్తర ప్రదేశ్‌కు వచ్చేయి అని పిలుస్తారామోనని. ఇంటి నుంచి అప్పుడప్పుడు వాళ్ల నాన్న డబ్బులు పంపించినా కూడా అవి ఏ మూలా సరిపోయేవి కాదు.

క్రికెట్‌ను మాత్రం అతను మానలేదు
దీంతో తినడం కోసం సొంతంగా పనులు చేయడం మొదలెట్టాడు. పానీ పూరీ సైతం అమ్మాడు. ఓ షాపింగ్ దుకాణంలో కూడా పనిచేశాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా క్రికెట్‌ను మాత్రం అతను మానలేదు. ఆటను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. స్థానిక టోర్నీల్లో పాల్గొంటూ సెంచరీల మీద సెంచరీలు బాదాడు. దాంతో స్థానికంగా జైశ్వాల్ పేరు మార్మోగింది. ఆ నోటా ఈ నోటా పడి అది చివరకు స్థానిక క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ చెవికి చేరింది.

జ్వాలా సింగ్ శిక్షణలో రాటుదేలిన యశస్వి
దీంతో వేరే వారి ద్వారా యశస్వి గురించి తెలుసుకున్న జ్వాలా సింగ్ అతని ఆటను చూద్దామని మైదానానికి వచ్చాడు. డివిజన్-ఎ ఆటగాడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని ఫోర్లు మీద ఫోర్లు సాధిస్తున్న యశస్వి ఆట చూసి అతడు ముగ్ధుడయ్యాడు. దీంతో జైశ్వాల్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకొని తనతో పాటు తీసుకెళ్లాడు. జ్వాలాసింగ్ శిక్షణలో రాటుదేలిన యశస్వి జైశ్వాల్ ముంబై అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ముంబై అండర్-19 జట్టు తరపున అద్భుత ప్రదర్శన కనబరిచి ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ శ్రీలంకలో పర్యటించే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు.


Click it and Unblock the Notifications












