టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యంపై ప్రస్తుతం తీవ్ర చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లాండ్ సిరీస్ కోసం మీటింగ్ నిర్వహించి జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులోనే టీమిండియా ప్రదర్శన, ఆటగాళ్ల ఫామ్ పై రివ్యూ మీటింగ్ కూడా జరిగిందట. ఈ క్రమంలోనే విరాట్, రోహిత్ భవితవ్యంపై డిస్కషన్ జరిగిందని తెలిసింది.
దశాబ్ద కాలం నుంచి టీమిండియా.. కోహ్లీ, రోహిత్ భుజస్కంధాల మీదే నడుస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ టన్నుల కొద్దీ పరుగులు చేసి ఎన్నో కఠిన మ్యాచుల్లో జట్టును గెలిపించారు. కెప్టెన్స్‌గానూ టీమ్ మీద తమదైన ముద్ర వేశారు. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్నట్లుగా, అగ్రప్లేయర్లుగా ఉన్న ఈ ఇద్దరూ ఇప్పుడు జట్టులో చోటు కోసం కష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ జట్టులో బెర్త్ కష్టంగా మారింది. ఇప్పటికే బోర్డర్ గావస్కర్ ట్రోఫీతో టెస్టుల్లో వీళ్ల కెరీర్ దాదాపుగా ముగిసిందనే ప్రచారం సాగుతోంది.

రోహిత్ విషయానికొస్తే.. 37 ఏళ్ల హిట్ మ్యాన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో అంతగా రాణించలేకపోతున్నాడు. గత ఎనిమిది మ్యాచుల్లో కేవలం 164 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఓ ఫిఫ్టీ ఉంది. ఇక 31 పరుగులను 6.2 యావరేజ్ తో ఐదు ఇన్నింగ్స్ లో చేశాడు. అయితే రీసెంట్ గా ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోని ఓ మ్యాచ్ కు రోహిత్ స్వయంగా తప్పుకోవడంతో అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు. కానీ అప్పుడు హిట్ మ్యాన్ తాను ఎక్కడికి వెళ్లట్లేదని చెప్పాడు. దీనిపై రివ్యూ మీటింగ్ లో ఏం జరిగిందనే విషయమై ఓ ఇంగ్లీష్ రిపోర్ట్ వచ్చింది.
"నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు అని రోహిత్ చేసిన ప్రకటన, అంతిమంగా ఎలా మారుతుందో చెప్పలేం. టెస్టు క్రికెట్‌లో రోహిత్ గ్రాఫ్ పడిపోవడంపై సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. అయితే కెప్టెన్ సరైన సమయంలో ఆలోచించదగిన నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది." అని సదరు రిపోర్టులో ఉంది.

గిల్ పై కోహ్లీ భవితవ్యం
కోహ్లీ ప్రస్తుతానికి కాస్త నిలకడగానే ఆడుతున్నప్పటికీ, అతడి ఫామ్ పై కూడా సెలక్టర్లు ఆందోళన చెందుతున్నారని తెలిసింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం విరాట్ భవితవ్యం, త్వరలోనే ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో గిల్ చేసే ప్రదర్శనపై ఆధారపడి ఉందని సమాచారం అందింది.
"ఇంగ్లాండ్ తో జరగబోయే ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ కు ఇంకా ఐదు నెలల సమయం మిగిలి ఉంది. అయితే సచిన్ వారసత్వాన్ని కోహ్లీ ఎలా కొనసాగించాడో, అలానే కోహ్లీ స్థానాన్ని గిల్ భర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దీని గురించే ప్రస్తుతం జరిగిన మీటింగ్ లో ప్రస్తావానికి వచ్చింది." అని రిపోర్ట్ లో రాసి ఉంది.
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో గిల్ అంతగా ప్రదర్శన చేయలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్ లో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. 2020-2021 గబ్బా టెస్ట్ లో అదిరే ప్రదర్శన చేసిన గిల్, ఆ తర్వాత ఆసియా బయట జరిగిన మ్యాచుల్లో గబ్బా స్థాయిలో ప్రదర్శన చేయలేదు. తన గత 14 ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు లేకుండా 233 పరుగులు మాత్రమే చేశాడు. చూడాలి ఇకపై ఎలాంటి ప్రదర్శన చేస్తాడో.