బెంగుళూరు: భారత జట్టుకు కెప్టెన్సీ వహించడం అనేది 'తలపై ముళ్ల కిరీటం' పెట్టుకున్నట్లేనని గతంలో ఓ మాజీ కెప్టెన్ అన్న మాటలివి. నిజమే, టీమిండియాకు కెప్టెన్సీ వహించడం అనేది చాలా పెద్ద బాధ్యత. మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆకాశానికి ఎత్తే అభిమానులు, అదే మ్యాచ్‌లో ఓడితే ఇంటిపై రాళ్లు కూడా విసురుతారు.
బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకడు. తన ఆట తీరుతోనే కాదు, కెప్టెన్‌గా ఎలా ఉండాలో ధోనినే చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. నిజానికి ఓ జట్టుకు కెప్టెన్సీ వహించడమంటే మైదానంలో తోటి ఆటగాళ్లకు ఎలా ఆడాలో చెప్పడమే కాదు.
ఫోటో గ్యాలెరీ : వరల్డ్T20

ఉత్కంట భరితంగా సాగే మ్యాచ్‌లో బంతి ఎక్కడికొస్తుందో, దాన్ని బ్యాట్స్‌మెన్ ఎల కొడతాడో... ఆ బంతిని క్యాచ్ పట్టడానికి సరైన స్థానం ఏదో, అక్కడే ఫీల్డర్స్‌ను నిలబెట్టడం లాంటి ఆలోచనలు అప్పటికప్పుడే రావాలి. అంతేకాదు ఒక్కోసారి మ్యాచ్‌కు ముందు వేసిన వ్యూహాలు ఫలించకపోతే, అప్పటికప్పుడు కొత్త వ్యూహాలకు తెరలేపాలి.
అప్పుడే మ్యాచ్‌లో విజయం సాధించగలగుతాం. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో కెప్టెన్ ధోనీ సరిగ్గా ఇదే విధంగా అద్భుతమైన వ్యూహాన్ని రచించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఏమాత్రం అనుభవం లేని పేసర్ హార్దిక్ పాండ్యను ఎంచుకున్నాడు. కాగా అంతకముందు స్పెల్‌లో పాండ్యా ఏకంగా 16 పరుగులు సమర్పించుకున్నాడు.

ఆఖరి ఓవర్లో బంగ్లాదేశ్ విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చింది. నెహ్రా, బుమ్రా, అశ్విన్, జడేజా ఓవర్లు పూర్తయయ్యాయి. దీంతో ఇక హార్దిక్ పాండ్యానే బౌలింగ్ వేయాల్సి ఉంది. ధోని కూడా అతడినే నమ్మాడు. ఆరు బంతులు... 11 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ చిరస్మరణీయ విజయం సాధిస్తుంది.
దాంతో సీనియర్ బౌలర్లంతా పాండ్యాను దగ్గరకు తీసుకుని తమకు తోచిన సలహాలు ఇచ్చారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆశిష్ నెహ్రా అయితే బాల్ ఎలా వేయాలన్న విషయం మీద చివరి నిమిషం వరకు చెబుతూనే ఉన్నాడు. అప్పుడే కెప్టెన్ ధోని రంగంలోకి దిగాడు.

బంతిని కూల్‌గా వేయడంతో పాటు ధైర్యంగా ఉండమని చెప్పాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో యార్కర్లు వేయొద్దని స్పష్టం చేశాడు. కాస్త బ్యాక్ ఆఫ్ ద లెంగ్త్ డెలివరీ వేయాలని.. అయితే ఎంత లెంగ్త్ అన్నది మాత్రం అప్పటికప్పుడు చూసుకోవాల్సి అంటూ సూచన చేశాడు.
మళ్లీ వైడ్ బాల్ మాత్రం వేయొద్దని, అలా వేస్తే బంతి కీపర్ చేతిలోకి వచ్చేలోపు బ్యాట్స్‌మన్ ఓ పరుగు తీసేస్తాడని తెలిపాడు. దీంతో ధోని ఏం చెప్పాడో అదే విధంగా పాండ్యా తన చివరి ఓవర్‌ను వ్యూహాం ప్రకారం అమలు చేశాడు. క్రీజులో బంగ్లా ఆటగాళ్లు ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా ఉన్నారు. పాండ్యా వేసిన తొలి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీశాడు.
ఆపై రెండు బంతుల్లో రెండు ఫోర్లు. భారత అభిమానులు విజయంపై ఆశలు వదిలేసుకున్న వేళ, ఊహించని మలుపు తిరిగింది. మ్యాచ్‌ని ఫినిష్ చేద్దామనుకున్న ముష్ఫికర్ నాలుగో బంతిని గాల్లోకి లేపాడు. డీప్ వికెట్‌లో ఉన్న ధావన్ దానిని క్యాచ్ పట్టుకున్నాడు. అయినా మ్యాచ్ బంగ్లాదేశ్ చేతుల్లోనే ఉంది. రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి.
ఈ సమయంలో స్ట్రయికింగ్‌లో మహ్మదుల్లా ఉండటంతో విజయంపై ఆ జట్టుకు అనుమానాల్లేవ్. ఈసారి డీప్ వికెట్‌లో ఉన్న జడేజా కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. దీంతో రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు పడ్డాయి. ఆపై మిగిలింది ఒక్క బంతి. ఇక చివరి బంతి కూడా కొంచెం వైడ్ బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ వేశాడు.

ఒక పరుగు తీస్తే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. దీంతో సూపర్ ఓవర్ అవకాశం వస్తుందన్న ఆశతో పరుగు మొదలుపెట్టారు. కానీ వికెట్ల వెనక 15 అడుగుల దూరంలో ఉన్న కీపర్ ధోని బ్యాట్స్‌మెన్ కంటే వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన స్టంపింగ్ చేశాడు.
నిజానికి వికెట్లకు నేరుగా త్రో చేసే అవకాశం ఉన్నా, అది గురి తప్పితే రిస్క్ అవుతుందని గ్రహించిన ధోని బంతి ఉన్న చేత్తోనే వికెట్లను పడగొట్టాడు. దీంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టీమిండియా చేతిలో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఒక్కసారిగా స్టేడియంలోని భారత్ అభిమానులంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.