టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ కథ ముగిసింది. సూపర్-8 స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో తడబడింది. ఆంటిగ్వా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే టోర్నీ నుంచి వెస్టిండీస్ వైదొలగడానికి ఓ శాపమే కారణమని నెట్టింట పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
క్రికెట్ చరిత్ర ప్రారంభ దశలో వెస్టిండీస్‌కు మించిన మరో బలమైన జట్టే లేదు. విండీస్‌తో ఆడాలంటే ప్రత్యర్థి జట్లు భయపడేవి. కానీ కట్ చేస్తే.. 2023 వన్డే వరల్డ్ కప్‌కు ఆడే కనీస అర్హతను కూడా వెస్టిండీస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆ కసితో వెస్టిండీస్ జట్టులో కీలకమార్పులు వచ్చాయి. ఫ్రాంచైజీ లీగ్‌లో మాత్రమే రెచ్చిపోతారనే పేరుండే విండీస్ ఆటగాళ్లు జట్టుగా ఒక్కటయ్యారు. తిరిగి వెస్టిండీస్ సత్తాను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేయాలని కసితో ఆడారు.

టీ20 వరల్డ్ కప్‌ను ముచ్చటగా మూడోసారి ముద్దాడాలని కసితో టోర్నీని ప్రారంభించారు. అంతేగాక సొంతమైదానంలో ప్రపంచకప్ జరుగుతుండటం విండీస్‌కు అదనపు బలంగా మారింది. అయితే అదే వెస్టిండీస్‌కు శాపంగా మారిందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన ఏ జట్టూ ఇప్పటివరకు టైటిల్‌ను కైవసం చేసుకోలేదని, అదో శాపమని అంటున్నారు. రికార్డుల పరంగా చూస్తే అది నిజమే. గత ఎనిమిది టీ20 ప్రపంచకప్‌ల్లో ఆతిథ్య జట్టు ట్రోఫీని అందుకోలేదు.
2007లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వగా భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2009 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గెలిచింది. 2010 టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్‌లో జరగ్గా ఇంగ్లండ్, 2012 ప్రపంచకప్ శ్రీలంకలో జరగ్గా వెస్టిండీస్ ఛాంపియన్‌లుగా నిలిచాయి. 2014 మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వగా శ్రీలంక విజేతగా నిలిచింది. అలాగే భారత్‌లో జరిగిన 2016 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
2021లో యఏఈ-ఒమన్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వగా ఆస్ట్రేలియా ట్రోఫీని గెలిచింది. ఇక ఆస్ట్రేలియాలో జరిగిన గత 2022 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ టైటిల్‌ను సాధించింది. ఈ లెక్కన ఆతిథ్య జట్టు సరిగా ఆడలేదనుకుంటే పొరపాటే. 2016లో టీమిండియా గొప్పగా పోరాడింది. కానీ టైటిల్‌ను అందుకోలేకపోయింది. అందుకే ఇదో శాపమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.