
ఇండియన్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. జూన్ 9న ప్రారంభమయ్యే భారత్-దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స్టేడియంలలోకి పూర్తి స్థాయి సామర్థ్యంతో అభిమానులను అనుమతించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇప్పటికే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కోసం బీసీసీఐ పూర్తి స్థాయి ప్రేక్షకులను అనుమతించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా పూర్తిగా అదుపులో ఉండడంతో భారత ప్రభుత్వం కోవిడ్ ప్రోటోకాల్‌లను సడలించింది. ఫలితంగా బీసీసీఐ రాబోయే సిరీస్‌లలో స్టేడియంలలోకి ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అనుమతించడానికి సన్నద్ధమైంది.
ఇక న్యూఢిల్లీ, కటక్, విశాఖపట్నం, రాజ్‌కోట్ మరియు బెంగళూరు వేదికలుగా భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆడనుంది. జూన్ 9న ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ జూన్ 19న జరగనుంది. ఈ క్రమంలో భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఇటీవలే 16మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టెంబా బావుమా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా టీమ్‌కు ఇది చాలా ముఖ్యమైన పర్యటన కానుంది. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని త్రుటిలో మిస్సయిన తర్వాత దక్షిణాఫ్రికాకు ఇది తొలి టీ20 టోర్నమెంట్ కానుంది. ఇక ఆస్ట్రేలియాలో జరగనున్న రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో సూపర్ 12దశ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇండియా ఒకే గ్రూప్‌లో ఆడనున్నాయి.
టీమిండియాతో తలపడే సౌతాఫ్రికా జట్టు ఇదే
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్ , హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడియన్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నోర్ట్జే, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, మార్కో జాన్సెన్.