
హైదరాబాద్: ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఘోర ఓటమి పాలైన నేపథ్యంలో రెండో టెస్టుకు కొన్ని మార్పులు అవసరమని ఆ దేశ మాజీ అటగాడు కెవిన్ పీటర్సన్ సూచించాడు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 2న అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా తొలి టెస్టులో ఏ మాత్రం ఆకట్టుకోలేని ఫాస్ట్ బౌలర్ జాక్ బాల్‌ను తీసేయడమే మంచిదని పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. 'అడిలైడ్ ఓవల్‌లో జరిగే రెండో టెస్టులో బౌలింగ్ లైనప్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. రెండో టెస్టుకు జాక్ బాల్‌ని తప్పించడమే మంచింది. కీలకమైన రెండో టెస్టులో బాల్‌కు ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు' అని పేర్కొన్నాడు.
'జాక్ బాల్ ఆశించిన స్థాయిలో రాణించాడని అనుకుంటున్నారా? అయితే నేను చూసినంత వరకూ అయితే అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అతనికి ఛాన్స్ ఇవ్వడం అనవసరం. నేను అయితే రెండో టెస్టుకు బాల్‌కు అవకాశం ఇవ్వను' అని పీటర్సన్ పేర్కొన్నాడు.
గబ్బా స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గబ్బా టెస్టులో జాక్ బాల్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జాక్ బాల్‌ను రెండో టెస్టుకు తప్పించాలంటూ ఇంగ్లండ్ యాజమాన్యానికి పీటర్సన్ సూచించాడు.
మరోవైపు తొలి టెస్టులో గాయపడి రెండో టెస్టుకు దూరమైన మొయిన్ అలీ స్ధానంలో ఇంతవరకు టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేయని లెగ్ స్పిన్నర్ మాసన్ క్రేన్‌కు అవకాశం ఇవ్వాలని పీటర్సన్ సూచించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.