ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ తొలి మ్యాచ్ గురువారం ప్రారంభం కానుంది. అయితే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్ బాధ్యతల నుంచి కేఎల్ రాహుల్‌ను తప్పిస్తున్నట్లుగా టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. రాహుల్‌ను కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతాడని వివరించాడు.
''ఇంగ్లాండ్ సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఆడట్లేదు. టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసే ముందే అతడి విషయంలో స్పష్టంగా ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లుగా కేఎస్ భరత్, ధ్రువ్ జురేల్‌ను జట్టులోకి తీసుకున్నాం. రాహుల్ అద్భుతంగానే తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌ను 'డ్రా'గా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు''

''కానీ భారత్‌లో పరిస్థితులు, ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్‌లలో ఒకరు వికెట్ కీపర్‌గా తుది జట్టులోకి వస్తారు. ఇక్కడ స్పిన్‌కు అనుకూలించే పిచ్ పరిస్థితుల్లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బౌలింగ్‌కు స్పెష్టలిస్ట్ వికెట్ కీపర్ కావాలి'' అని ద్రవిడ్ అన్నాడు.
గాయంతో రిషభ్ పంత్ దూరమవ్వగా కేఎస్ భరత్ వికెట్ కీపర్‌గా జట్టులోకి వచ్చాడు. అతడు చివరిగా గత వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 28 పరుగులే చేశాడు. అయిదు టెస్టులు ఆడిన భరత్ 18 సగటుతో 129 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తుండిపోయే ప్రదర్శన చేయనప్పటికీ దేశవాళీ, భారత్-ఎ జట్టు తరపున భరత్ రాణిస్తున్నాడు. ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో సెంచరీతో సత్తాచాటాడు.
ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు తుది జట్టులో వికెట్ కీపర్‌గా భరత్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ధ్రువ్ విషయానికొస్తే.. దేశవాళీ క్రికెట్‌లో అతడు 46 సగటుతో 790 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ అందుబాటులోకి లేకపోవడంతో బ్యాకప్ వికెట్ కీపర్‌గా ధ్రువ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా, విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు దూరమైన విషయం తెలిసిందే.

తొలి రెండు టెస్టులకు ఎంపికైన టీమిండియా: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్