మరో రెండు రోజుల్లో ఐపీఎల్ సందడి మొదలుకానుంది. మార్చి 22న ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి సీజన్‌లో టైటిల్‌ను దక్కించుకున్న రాజస్థాన్ రాయల్స్ మరోసారి ట్రోఫీని ముద్దాడాలని ఈసారి కసిగా బరిలోకి దిగుతోంది. అయితే జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేకపోయినా గత 15 సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.2023లో ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఈ సీజన్‌లో యువ ప్లేయర్లు ఫామ్‌లో ఉండటం రాజస్థాన్ రాయల్స్‌కు సానుకులాంశంగా మారింది. యశస్వీ జైస్వాల్, ధ్రువ్ జురెల్ జట్టుకు ప్రధానబలంగా మారారు. అయితే కెప్టెన్ సంజు శాంసన్‌పై బాధ్యతలు మరిన్ని పెరిగాయి. జట్టుకు నాయకత్వం వహిస్తూనే శాంసన్ తన ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే శాంసన్‌కు ఈ సీజన్ ఎంతో కీలకం.

29 ఏళ్ల సంజు శాంసన్ 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ ఇప్పటికీ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగలేకపోతున్నాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. దీనిపై శాంసన్ స్పందించాడు. టీమిండియాలో చోటు కోల్పోవడం గురించి మాట్లాడాడు. జాతీయ జట్టులో కొనసాగాలంటే ప్రత్యేకంగా ఏదైనా సత్తాచాటాలని, అంతేగాక దేశంలో ఉన్న విపరీతమైన పోటీ వల్ల టీమ్‌లో రెగ్యులర్‌గా చోటు సంపాదించలేకపోయానని శాంసన్ తెలిపాడు.
''ప్రపంచంలో అత్యుత్తమ దేశానికి క్రికెట్ ఆడుతున్నాం. వరల్డ్‌లోనే భారత్ నంబర్ వన్. దేశంలో ఎంతో మంది ప్లేయర్లు ఉన్నారు. ఎంతో టాలెంట్ ఉంది. అందులో కేరళ నుంచి వచ్చిన నేనూ ఒక్కడిని. టీమిండియాలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఏదైనా చేయాలి. బ్యాటింగ్‌లో నా శైలిలో ఆడాలని భావిస్తా. తొలి బంతిని అయినా సిక్సర్‌గా బాదడానికి ట్రై చేస్తా. సిక్సర్ సాధించడానికి పది బంతులు వరకు ఎందుకు ఎదురుచూడాలి? నా ఆలోచన ఇలానే ఉంటుంది. కాస్త భిన్నంగా ఆలోచిస్తా. అదే నా పవర్ హిట్టింగ్‌కు కారణం. నేను ఆడే జట్టుకు ఏదైనా అద్భుతం చేయాలని భావిస్తుంటాను'' అని సంజు శాంసన్ పేర్కొన్నాడు.