
బౌలర్లు ఏం చేయాలో అది చేశారు
మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'ఇలాంటి మ్యాచ్‌లను గతంలో చూశాను. మా జట్టు కూర్పు గొప్పగా ఉంది. ఆ భయంతోనే మిగతా జట్ల వారు మేము గెలవకూడదనుకుంటున్నారు. ఇప్పుటకీ మా జట్టు ఎంతో బలంగా ఉంది. ఇలాంటి మ్యాచ్‌లను ఇంతకుముందు చూశాను. మ్యాచ్ చివరివరకు ప్రశాంతంగా ఉన్నాను. బౌలర్లు ఏం చేయాలో అది చేశారు. గత రెండు మ్యాచ్‌లు మేం ఇలాగే గెలిచాం. ముంబై జట్టులా మా జట్టు విజయాలందుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలించింది' అని అన్నాడు.
మొయిన్ అలీ అద్భుతంగా ఆడాడు
'రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ బాగా అనుకూలించింది. మా బౌలర్లకు హ్యాట్సాఫ్. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్‌ను మా బౌలర్లు కట్టడి చేసిన తీరు నిజంగా అద్భుతం. ఇదే విధంగా గత మూడు మ్యాచుల్లో మా బౌలర్లు అండగా నిలిచారు. ఈ ఉత్సాహంతో రాజస్తాన్ రాయల్స్‌పై విజయం సాధిస్తాం. ఈ రోజు ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ అద్భుతంగా ఆడారు. అలీ గొప్ప ఇన్నింగ్స్ కారణంగానే మేము గెలిచాం' అని కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
అలా ఎవరు అనుకరించకండి
ఇక, ఈ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచిన ఏబీ డివిలియర్స్ సూపర్ మ్యాన్ క్యాచ్‌పై కోహ్లీ మాట్లాడుతూ 'అది ఒక స్పైడర్‌మన్ స్టఫ్. అలా ఎవరు అనుకరించకండి. అది కచ్చితంగా సిక్స్ అని నేను భావించా. కానీ ఏబీ అద్భుతంగా అందుకున్నాడు. అతని ఫీల్డింగ్‌ను నేను అనుకరిస్తున్నాను. హోంగ్రౌండ్‌లో జరిగిన చివరి మ్యాచ్‌కు మద్దతు తెలిపిన అభిమానులందరికి కృతజ్ఞతలు' అని అన్నాడు.
డివిలియర్స్ క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లో మెరిసిన డివిలియర్స్.. ఆపై అద్భుతమైన క్యాచ్‌ను పట్టి ఫీల్డింగ్‌లో కూడా తనదైన మార్కును మరోసారి చూపెట్టాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఆర్సీబీ బౌలర్ మొయిన్ అలీ వేసిన ఎనిమిదో ఓవర్ ఆఖరి బంతిని అలెక్స్ హేల్స్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న డివిలియర్స్ గాల్లో అమాంతం ఎగిరి క్యాచ్‌ను ఒంటి చేత్తో అందుకున్నాడు. ఆ క‍్రమంలోనే బౌండరీ లైన్ తాకకుండా తనను తాను అద్భుతంగా నియంత్రించుకున్న తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఏబీ సెన్సేషనల్ క్యాచ్‌తో చిన్నస్వామి స్టేడియం మార్మోగిపోయింది.

14 పరుగుల తేడాతో బెంగళూరు విజయం
ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఏబీ డివిలియర్స్ (69), మొయిన్ అలీ (65), గ్రాండ్ హోమ్ (40 చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకి ఇది నాలుగో ఓటమి. మరోవైపు ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆరో విజయాన్ని అందుకున్న బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకి.. ప్లేఆఫ్ రేసుని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. హైదరాబాద్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












