ఇంగ్లాండ్‌తో అయిదు టెస్టు సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. ఉప్పల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ టెస్టు గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు కఠోర సాధన చేస్తున్నాయి. తమ బజ్ బాల్ సిద్ధాంతంతోనే రోహిత్ సేనపై పైచేయి సాధించాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. అయితే ఆ బాజ్‌బాల్ అప్రోచ్ తమకు కలిసొస్తుందని టీమిండియా స్టార్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో ఇంగ్లిష్ బ్యాటర్లు తప్పులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బుమ్రా తెలిపాడు.
''బాజ్‌బాల్ గురించి పెద్దగా ఆలోచించట్లేదు. అయితే ఇంగ్లాండ్ జట్టు విజయవంతమైన క్రికెట్ ఆడుతోంది. టెస్టు క్రికెట్ ఆడటానికి మరో మార్గం ఉందని ప్రపంచానికి తన దూకుడు చూపిస్తోంది. మరోవైపు బౌలర్‌గా ఇది నాకు కలిసొస్తుందని భావిస్తున్నా. వికెట్లు సాధించడానికి అనుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నా. పరిస్థితులను నాకు తగ్గట్టుగా మార్చుకోవడానికి నేను ఆలోచిస్తాను'' అని బుమ్రా అన్నాడు.

2021లో ఇంగ్లాండ్‌లో భారత్ పర్యటన గురించి బుమ్రా తన అనుభవాలు పంచుకున్నాడు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ గొప్ప బౌలర్ అని కొనియాడాడు. చిన్నప్పటినుంచి అండర్సన్ బౌలింగ్‌ను చూస్తున్నాని, 41 ఏళ్ల వయసులోనూ అతడు గొప్పగా సత్తాచాటుతున్నాడని అన్నాడు. క్రికెట్ పట్ల అతడికి ఉన్న ఆకలి, అభిరుచికి ఇది నిదర్శమని పేర్కొన్నాడు. అయితే 2021లో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అండర్సన్ సరిగా బదులివ్వలేదని, అది టీమిండియా మొత్తంపై ప్రభావం చూపించిందని వివరించాడు.
లార్డ్స్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో చివరి బ్యాటర్‌గా అండర్సన్ క్రీజులోకి వచ్చాడు. అండర్సన్‌కు బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇబ్బందిపెట్టాడు. ఈ క్రమంలో అతడి హెల్మెట్‌కు బంతి తగిలింది. దీంతో అండర్సన్‌ను బుమ్రా పలకరించాడు. ఎలా ఉన్నావని అడిగాడు. కానీ దానికి అండర్సన్ సరిగా బదులివ్వలేదు. అప్పటికి 25 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు. అండర్సన్‌కు 26వ ఓవర్ వేసిన బుమ్రా నోబాల్స్‌తో కలిపి ఆ ఓవర్‌లో పది బంతులు వేశాడు.
''అప్పటికే నేను అలసిపోయాను. అదే ఇంగ్లాండ్ చివరి వికెట్. వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించా. ఓవర్ మధ్యలో అండర్సన్ దగ్గరికి వెళ్లి.. 'మీరు బాగానే ఉన్నారా' అని అడిగాను. కానీ అతడి నుంచి మంచి స్పందన రాలేదు. మంచిగా ఉండటానికి నేను ప్రయత్నించినప్పటికీ సరైన బదులు రాలేదు. ఇది మొత్తం జట్టును ప్రేరేపించింది. ఆ తర్వాత మా అందరి కళ్లు ఎర్రబడ్డాయి.పోరాడుతూ ఆడటం మా రెండో స్వభావం. దాన్ని నియంత్రణలో ఉంచడానికే ప్రయత్నిస్తాం'' అని బుమ్రా అన్నాడు.
ఈ టెస్టులో భారత్ చారిత్రక విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బౌలర్లు చెలరేగారు. ప్రత్యర్థి బ్యాటర్లు భయపడేలా బంతులు సంధించారు. 60 ఓవర్లలోపే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీని యుద్ధంలా చేశాడని వ్యాఖ్యాతలు అభివర్ణించారు.