పల్లెకెలె: ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న శ్రీలంకకు మరో షాక్ తగిలింది. భారత్‌తో ఆదివారం మూడో వన్డే జరగనున్న నేపథ్యంలో కెప్టెన్ ఉపుల్ తరంగపై రెండు వన్డేల సస్పెన్షన్ వేటు పడింది. పల్లెకెలెలో భారత్‌తో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడిని సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుండడంతో ఆదివారం జరగనున్న మూడో వన్డేతోపాటు ఈ నెల 31 జరగనున్న నాలుగో వన్డేకు కూడా అతడు దూరం కానున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఉపుల్ తరంగపై ఇటువంటి కారణంతోనే వేటు పడింది.

కెప్టెన్ ఉపుల్ తరంగ జట్టుకు దూరం కానుండడంతో ఆదివారం నాటి మ్యాచ్‌లో రెండు మార్పులతో శ్రీలంక బరిలోకి దిగబోతోంది. టెస్ట్ కెప్టెన్ దినేష్ చండీమల్, బ్యాట్స్‌మన్ లహిరు తిరిమన్నెలను బరిలోకి దించనుంది.
అయితే టెస్ట్ కెప్టెన్ అయిన చండీమల్ కాకుండా వైస్ కెప్టెన్ చమర కపుగెదరకు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేల్లో ఓటమి పాలైన శ్రీలంకకు కెప్టెన్ ఉపుల్ తరంగ దూరం కావడం దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.
మాథ్యూస్ నిర్ణయం సరైంది కాదు: రణతుంగ
శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్సీ కి గుడ్ బై చెబుతూ ఏంజెలో మాథ్యూస్ తీసుకున్న నిర్ణయం ఎంతమాత్రం సరైంది కాదని ఆ దేశ దిగ్గజ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డాడు. ఇక్కడ అతను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెబితే శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ ఎల్ సీ) ఎలా అనుమతి ఇచ్చిందని రణతుంగ ప్రశ్నించాడు.
మాథ్యూస్ కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందన్నాడు. జట్టు అవసరాల దృష్ట్యా అతన్ని మరికొంత కాలం కెప్టెన్ గా కొనసాగమని ఎస్ఎల్‌సీ పెద్దలు కోరి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ కెప్టెన్సీ విషయంలో తనను మాథ్యూస్ అడిగితే అనుమతి ఇచ్చేవాడిని కాదన్నాడు. అందుకు ఇది తగిన సమయం కాదని చెప్పేవాడినని రణతుంగ పేర్కొన్నాడు.
'నేను చూసిన లంక కెప్టెన్లలో మాథ్యూస్ ఒక అత్యుత్తమ కెప్టెన్. రంజన్ మదుగలే తరువాత ఆ స్థాయి ఉన్న కెప్టెన్ మాథ్యూస్. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని బోర్డుకు చెప్పినప్పుడు అందుకు అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదు. మాథ్యూస్ నిర్ణయాన్ని కొన్నాళ్లు అలా ఉంచుకోమని బోర్డు చెప్పి ఉండాల్సింది. అది చేయకపోవడంతో లంక జట్టు పరిస్థితి పూర్తిగా గాడి తప్పింది' అని రణతుంగ అభిప్రాయపడ్డాడు.
'గత సంవత్సరం ఆసీస్ వంటి నంబర్ వన్ జట్టును మాథ్యూస్ నేతృత్వంలోని శ్రీలంక వైట్ వాష్ చేసింది. ఆ క్రెడిట్ మాథ్యూస్ తో పాటు యావత్ జట్టుకు దక్కింది. అయితే జట్టు ఓటములకే మాథ్యూస్‌ను బలి పశువును చేస్తున్నారు. ఇది నిజంగా బాధాకరం. ఈ కారణం చేత మాథ్యూస్ అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. మాథ్యూస్ సానుకూల ధోరణి గల కెప్టెన్. అతను ఆత్మవిశ్వాసం సడలడానికి మా క్రికెట్ బోర్డే కారణం' అని రణతుంగా స్పష్టం చేయడం గమనార్హం. కాగా, జులై నెలలో మాథ్యూస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.