హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా మరికొన్ని గంటల్లో తన క్రికెట్ కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి 7 గంటలకు న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌తో నెహ్రా తన 18 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కి వీడ్కోలు చెప్పనున్నాడు.
ఈ సందర్భంగా తన చివరి మ్యాచ్‌కు ముందు జట్టులోని సహచర క్రికెటర్లు నెహ్రాకు ఘనంగా వీడ్కోలు పలికారు. నెహ్రాతో ఉన్న అనుబంధాన్ని రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానె గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
'ఆశిష్ నెహ్రాతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అవన్నీ పంచుకోలేను. కానీ.. ఇంగ్లాండ్‌పై 2003 ప్రపంచకప్‌లో నెహ్రా మ్యాజిక్ స్పెల్ 23/6 మాత్రం నాకింకా గుర్తుంది. భారత్ తరఫున ఇదే ఇప్పటికీ అత్యుత్తమ ప్రదర్శన. అతనికి ఇకపై అంతా మంచే జరగాలి' అని రోహిత్ శర్మ ఆకాంక్షించాడు.
'ఆశిష్ నెహ్రాకి మంచి హాస్య చతురత ఉంది. డ్రెస్సింగ్ రూములో చాలా జోక్స్ వేసేవాడు. క్రికెట్ తర్వాత కూడా అతనికి మంచి భవిష్యత్ ఉండాలి' అని శిఖర్ ధావన్ అన్నాడు.
'38 ఏళ్ల వయసులోనూ ఆశిష్ నెహ్రా మైదానంలో కష్టపడే విధానం ఫాస్ట్ బౌలర్లకి స్ఫూర్తిగా నిలిచింది' అని పేసర్ భువనేశ్వర్ కుమార్ గుర్తు చేసుకున్నాడు. 'గాయాల నుంచి కోలుకుని మళ్లీ టీమిండియాలో పునరాగమనం కోసం ఆశిష్ నెహ్రా చూపిన తెగువ అందరికీ ఆదర్శం' అని రహానే అన్నాడు.
నెహ్రా తన 18 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో సార్లు గాయాలు పాలయ్యాడు. తన కెరీర్ మొత్తంలో 12 సార్లు సర్జరీలు చేయించుకున్నాడు. 1999లో శ్రీలంకతో టెస్ట్‌ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆశిష్ నెహ్రా ఇప్పటివరకు 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడాడు.
క్రికెట్ కెరీర్‌లో ఎన్నో ఒడిదొడుకులు నెహ్రా ఎదుర్కొన్నాడు. జట్టులో అనేకమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సహచరులు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్నా.. ఏ మాత్రం నెరవకుండా జాతీయజట్టులో చోటు దక్కించుకుని యువ క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచాడు.
టెస్టులకు 2004లో, వన్డేలకు 2011 వరల్డ్ కప్ తర్వాత, 2014లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి రిటైరైన నెహ్రా టీ20ల్లో మాత్రం కొనసాగుతూనే ఉన్నాడు. భారత్ తరుపున 26 టీ20లు ఆడి 34వికెట్లు తీశాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20లో 3/19 అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశాడు.