న్యూయార్క్: చిరకాల ప్రత్యర్థి బ్యాట్స్‌మన్, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జట్టులో లభించడం పట్ల పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆనందం వ్యక్తం చేశాడు. ఎందుకంటే సచిన్ చాలా సార్లు అక్తర్ బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. ఇప్పుడు అతనికి ఆ భయం లేకుండా పోయింది.
క్రికెట్ దిగ్గజాలు సచిన్-షేన్ వార్న్‌ల ఆధ్వర్యంలో అమెరికాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న 'ఆల్ స్టార్స్ సిరీస్ టీ20'లో సచిన్ జట్టులో షోయబ్ అక్తర్‌కు చోటు లభించింది. సచిన్ లాంటి గొప్ప స్నేహితుడి జట్టులో స్థానం లభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు షోయబ్ అక్తర్.
'సచిన్ కోసం నేను, నా కోసం సచిన్ ఆడుతున్నాం. ఆ దేవుడికి కృతజ్ఞలు. అతనికి ఎన్నోసార్లు బౌలింగ్ చేశా. గత 15ఏళ్లపాటు అతనికి బౌలింగ్ చేశా. అయితే ఇప్పుడు అతనికి బౌలింగ్ వేయాలని అనుకోవడం లేదు. ఇది నిజం' అని షోయబ్ తెలిపాడు.

'టెండూల్కర్‌కు బౌలింగ్ చేయడమంటే భయపడాల్సిందే. క్రికెట్ చరిత్రలో అతడి లాంటి ఆటగాడ్ని చూడలేదు' అని చెప్పాడు అక్తర్. సచిన్ ఒక గొప్ప స్నేహితుడు, గొప్ప క్రికెటర్, అద్భుతమైన వ్యక్తి అని షోయబ్ కొనియాడాడు.
'సచిన్‌ను కెప్టెన్‌గా చూడలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. అతని నేతృత్వంలో ఎలా రాణించాలనేదానిపై దృష్టి పెడతా' అని చెప్పాడు. అయితే, సచిన్‌కు తాను బౌలింగ్ వేయడాన్ని ప్రజలు ఇష్టపడతారని అన్నాడు. ఇప్పటికే ఆ పని చేశా, ఇప్పుడైతే చేయలేను అని చెప్పాడు. కాగా, ఆల్ స్టార్స్ సిరీస్ శనివారం రాత్రి తొలి మ్యాచ్ జరగనుంది.