గర్వంగా ఉంది: 72 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టడంపై విరాట్ కోహ్లీ

హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఇంతకుమించి గొప్ప విజయం మరొకటి ఉండదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఈ విజయం ఆసీస్ గడ్డపై టీమిండియాకి లభించిన గొప్ప గెలుపని అన్నాడు. "టీమిండియాకు ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. గత 12 నెలలుగా జట్టులో ఈ గెలుపు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏడాది కాలంగా జట్టులో వచ్చిన సమతుల్యతోనే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించాం. అంతకుముందు జరిగిన రెండు విదేశీ పర‍్యటనల్లో కూడా మా జట్టు సత్తా చాటింది. భారత క్రికెట్ జట్టు ఈ స్థాయి ప్రదర్శనను నేను ఎప్పుడూ చూడలేదు" అని కోహ్లీ అన్నాడు.
తొలిసారి టెస్టు కెప్టెన్‌గా
"నలుగురు పేసర్లతో విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా నా అనుభవంలో ఎదురుకాలేదు. ఇది జట్టు సభ్యులందరూ సాధించిన అద్భుతమైన ఘనత. ప్రధానంగా ఫిట్‌నెస్ స్థాయిని కాపాడుకోవడం వల్లే ఆసీస్‌లో విజయాలు సాధించాం. దీనికి జట్టు సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా గడ్డపైనే నేను తొలిసారి టెస్టు కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు అందుకున్నా. ఇప్పుడు గొప్ప ఆటగాళ్లతో నిండిన జట్టుని నడిపిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను" అని కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగో టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది.
2-1తో టెస్టు సిరీస్ కైవసం
దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 2-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయంతో ఈ ఘనత సాధించిన తొలి భారత, ఆసియా కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. దీంతో 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. సిడ్నీ వేదికగా ప్రారంభమైన చివరి టెస్టులో టీమిండియా విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వర్షం పదే పదే అంతరాయ కలిగించడంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు.
ఫాలో ఆన్ ఆడిన ఆస్ట్రేలియా
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 డిక్లేర్ చేయగా, ఆసీస్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆస్ట్రేలియాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాలో ఆన్‌కు ఆహ్వానించాడు. నాలుగో రోజైన ఆదివారం ఆటలో ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా ఆరు పరుగుల వద్ద ఉన్న సమయంలో వర్షం పడింది. చివరి రోజు ఆటకు సైతం వరుణుడు అడ్డుపడటంతో ఒక్క బంతి కూడా పడలేదు. దాంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.
పుజారాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించిన ఛటేశ్వర్ పుజారా(193) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్ 146 పరుగుల తేడాతో నెగ్గింది.

అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా
ఆ తర్వాత మెల్ బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి సిరిస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరిస్‌లో పుజారా 521 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, భారత బౌలర్లలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలవగా షమీ 16 వికెట్లు, ఇషాంత్ శర్మ 11 వికెట్లు తీశారు. గతంలో 1980-81, 1985-86, 2003-04 పర్యటనల్లో భారత్ సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన 47 టెస్టుల్లో టీమిండియాకు కేవలం 7 టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications