బాసెటెర్రే : జూలై 21 నుంచి టీమ్ ఇండియాతో జరగబోయే నాలుగు టెస్టుల సిరిస్ వెస్టిండీస్ కు సవాల్ లాంటిదే అంటున్నాడు విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్. యువకులు మరియు అనుభవలేమితో కూడిన విండీస్ టీమ్ కు ప్రపంచ నంబర్.2 గా కొనసాగుతున్న టీమ్ ఇండియాతో తలపడడం గట్టి సవాల్ అని పేర్కొన్నాడు.
నాణ్యత గల బ్యాటర్లు, బౌలర్లతో టీమ్ ఇండియా నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదని కెప్టెన్ హోల్డర్ వ్యాఖ్యానించాడు. ఇక తమ విండీస్ టీమ్ గురించి ప్రస్తావిస్తూ.. అనుభవలేమితో కూడిన తమ ఆటగాళ్లంతా జట్టులో కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందన్నాడు. రాబోయే మ్యాచుల్లో నిలదొక్కుకుని ఆడేలా డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లందరికీ తాను పదే పదే విషయాన్ని నొక్కి చెబుతున్నట్టుగా తెలిపాడు.

ముందు బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా స్కోర్ బోర్డుపై మంచి గణాంకాలు నమోదు చేసేందుకు క్రుషి చేస్తామన్నాడు. ఇక తన వ్యక్తిగత ప్రదర్శన గురించి స్పందిస్తూ రాబోయే సిరీస్ లో కనీసం ఒక సెంచరీ అయినా చేయాలని తాను బావిస్తున్నట్టుగా వెల్లడించాడు. గత సంవత్సరం సెంచరీ చేసిన అతను మళ్లీ ఆ స్థాయిలో రాణించలేదన్నాడు.
అలాగే ఇప్పటిదాకా టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు తీయలేకపోయిన హోల్డర్ రాబోయే మ్యాచుల్లో ఐదు వికెట్లు తీయడమే టార్గెట్ గా తాను బరిలోకి దిగబోతున్నట్టు వెల్లడించాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్న హోల్డర్ ప్రస్తుతం టీమ్ తో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని గతంతో పనిలేకుండా సిరీస్ లో సత్తా చాటుతానని ప్రకటించాడు.