
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనకు అంగీకరించినందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కృతజ్ఞతలు తెలిపాడు. భారత్‌లో తొలి డే/నైట్ టెస్టు మ్యాచ్ జరగబోతోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న రెండో టెస్టును ఫ్లడ్ లైట్ల కింద నిర్వహించాలన్న బీసీసీఐ ప్రతిపాదనకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీరించిన సంగతి తెలిసిందే.
దీంతో నవంబర్ 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ తొలి పింక్ బాల్ టెస్టును నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడుతూ "ఇది మంచి అభివృద్ధి. టెస్ట్ క్రికెట్‌కు ఈ మాత్రం పుష్ అవసరం. నా పని (డేనైట్ టెస్టు ఆడాలన్న చారిత్రక నిర్ణయంపై) నేను చేశా. నేను ఇక్కడ ఉంది అందుకే. టెస్ట్ క్రికెట్‌కు డేనైట్ మ్యాచ్‌లు ఎంతో అవసరం. ఈ నిర్ణయం వల్ల మళ్లీ ప్రేక్షకులు మైదానాలకు వస్తారని భావిస్తున్నా. మా ప్రతిపాదనకు వెంటనే అంగీకరించినందుకు కోహ్లీకి కృతజ్ఞతలు. అంతకన్నా ఎక్కువగా ఇంత తక్కువ సమయంలో డేనైట్ మ్యాచ్‌కు ఒప్పుకున్నందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు" అని అన్నాడు.
డే/నైట్ టెస్టుపై బంగ్లాదేశ్ జట్టు కోచ్ రస్సెల్ డొమెనిగో మాట్లాడుతూ "టీమిండియాపై ఈడెన్ గార్డెన్స్‌లో ఇదొక గొప్ప అవకాశం. భారత జట్టు కూడా డే/నైట్ టెస్టు ఆడలేదు. ఇరు జట్లకు ఇది కొత్త అనుభవం. ఇది బహుశా రెండు జట్లను ఒకచోట చేర్చుతుంది. ఏం జరుగుతుందో ఇరు జట్లకు తెలియదు" అని అన్నాడు.
"కాబట్టి, మేము దీనీని సవాల్‌గా తీసుకుంటున్నాం. మా ఆటగాళ్ళలో కొందరు దీనిపై అనుమానం వ్యక్తం చేశారు, కానీ మేము సంతోషిస్తున్నాము. ఏ బ్రాండ్ బంతి ఉపయోగించబడుతుందో మాకు తెలియదు. పింక్ బాల్ టెస్టుకు సిద్ధమయ్యేందుకు మాకు చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ మేము దీనికి సంతోషిస్తున్నాము" అని బంగ్లా కోచ్ తెలిపాడు.
భారత్, బంగ్లాదేశ్ తప్ప టెస్టు హోదా ఉన్న అన్ని దేశాలూ డే/నైట్ టెస్టులు ఆడాయి. 2015లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ఫ్లడ్‌లైట్ల వెలుతురులో గులాబి బంతులతో తొలి డే/నైట్ టెస్టు జరిగింది. ఆ తర్వాత భారత్‌లో గతేడాది ప్రయోగాత్మకంగా దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను డే/నైట్‌లో నిర్వహించారు.
అయితే, పింక్ బాల్స్ అంత నాణ్యంగా లేవనే కారణంతో బీసీసీఐ డే/నైట్ టెస్టు ప్రతిపాదనలను తిరస్కరిస్తూ వస్తుంది. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా ఓ మ్యాచ్‌ను డే/నైట్‌లో ఆడాలని క్రికెట్ ఆస్ట్రేలియా కోరినా బీసీసీఐ అందుకు అంగీకరించలేదు. అయితే గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడయ్యాక మళ్లీ డే/నైట్ టెస్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
భారత్ పర్యటనలో బంగ్లాదేశ్ టీ20, టెస్ట్ సిరీస్ ఆడనుంది. టీ20ల సిరీస్‌లో భాగంగా నవంబర్ 3న ఢిల్లీ వేదికగా బంగ్లాతో భారత్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. అనంతరం రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా 14 నుండి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు 22 నుంచి రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆడాల్సి ఉంది.