Sania Mirza: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడాకుల తర్వాత తొలిసారి తన వ్యక్తిగత జీవితంలోని కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడింది. విడాకుల సమయంలో పరిస్థితి చాలా దారుణంగా మారిందని సానియా చెప్పుకొచ్చారు. తన విడాకుల సమయంలో పానిక్ అటాక్ వచ్చినప్పుడు తన స్నేహితురాలు, బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ తనకు ఎలా అండగా నిలిచారో ఆమె వివరించారు. సానియా మీర్జా కొత్త యూట్యూబ్ టాక్ షో "సర్వింగ్ ఇట్ అప్ విత్ సానియా" మొదటి ఎపిసోడ్‌లో ఫరా ఖాన్ అతిథిగా వచ్చినప్పుడు ఈ విషయాన్ని సానియా వెల్లడించారు.
సానియా మీర్జా మాట్లాడుతూ.. అది తన జీవితంలోనే అత్యంత కష్టతరమైన రోజులలో ఒకటని చెప్పుకొచ్చారు. ఒకసారి తనకు పానిక్ అటాక్ వచ్చినప్పుడు ఫరా ఖాన్ సెట్‌కు వచ్చి అండగా నిలిచారని సానియా తెలిపింది. "ఆ రోజు మీరు రాకపోతే నేను ఆ లైవ్ షో చేసేదాన్ని కాదు. నేను వణికిపోతున్నాను. పర్వాలేదు, నువ్వు ఈ షో చేస్తావు అని మీరు నాతో అన్నారు." అని సానియా చెప్పగా.. "నువ్వు పానిక్ అటాక్‌తో ఉండటం చూసి నేను భయపడ్డాను. షూటింగ్ ఉన్నా నా పైజామా, చెప్పుల్లోనే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేశాను" అని ఫరా ఖాన్ ఆ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆ క్షణంలో తన స్నేహితురాలికి తోడుగా ఉండాలని మాత్రమే తాను కోరుకున్నానని ఫరా ఖాన్ వివరించారు.

ఈ సంభాషణలో ఫరా ఖాన్ సానియా సింగిల్ పేరెంటింగ్ గురించి కూడా ప్రశంసించారు. తన కొడుకును ఒంటరిగా పెంచడంలో సానియా చాలా ధైర్యాన్ని, గౌరవాన్ని చూపించారని ఆమె అన్నారు. ""ఒంటరి తల్లిగా ఉండటం కంటే కష్టమైనది ఏమీ లేదు. నువ్వు నీ కెరీర్‌లో ఉన్నత శిఖరాలను, వ్యక్తిగతంగా అట్టడుగు స్థితిని చూశావు. రెండింటినీ సమానంగా ఎదుర్కొన్నావు" అని ఫరా అన్నారు.
2010లో సానియా వివాహం
సానియా మీర్జా ఏప్రిల్ 2010లో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకున్నారు. 2018లో వారి కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్ జన్మించాడు. జనవరి 2024లో షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత.. సానియా కుటుంబం వారిద్దరి విడాకుల విషయాన్ని ధ్రువీకరించింది.