న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంచలనాత్మక విషయాలు వెల్లడించాడు. తన ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే'లో పలు సంచలనాత్మకమైన విషయాలను వెల్లడించాడు. టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ హయాంలో జట్టులో చోటుచేసున్న దారుణ పరిణామాలను, ఎదురైన అవమానాలను, మానసిక సంఘర్షణలను బహిర్గతం చేశాడు. చాపెల్‌ను 'రింగ్ మాస్టర్'గా అభివర్ణించాడు. చాపెల్ తన ఆలోచనలను ఆటగాళ్లపై రుద్దేవాడని విమర్శించాడు.
2007 ప్రపంచ కప్‌కు ముందు ద్రావిడ్‌ను తప్పించి తనను కెప్టెన్సీ చేపట్టమనే షాకింగ్ సలహాను మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ చాపెల్ ఇచ్చాడని సచిన్ చెప్పాడు. ఇద్దరం కలిస్తే భారత క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు శాసించవచ్చని తనతో అన్నాడని చెప్పాడు. అందుకు తగిన సహకారం అందిస్తానని చాపెల్ చెప్పినట్లు మాస్టర్ సచిన్ తన ఆత్మకథలో రాశాడు. టెండూల్కర్ బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' గురువారం విడుదల కానుంది. 2005-07 మధ్య భారత జట్టుకు కోచ్‌గా ఉన్న చాపెల్‌పై సచిన్ తీవ్ర విమర్శలు చేశాడు.

ప్రపంచ కప్ పోటీలకు కొన్ని నెలల ముందు చాపెల్ తమ ఇంటికి వచ్చాడని, అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను తప్పించి కెప్టెన్సీ చేపడితే.. ఇద్దరం కలసి కొన్నేళ్ల పాటు భారత క్రికెట్‌ను నియంత్రిచవచ్చుననీ ఇందుు తాను పావులు కదుపుతాననీ చాపెల్ చెప్పాడని వెల్లడించాడు. "గ్రెగ్ మాటలకు నేను, అంజలి నిర్ఘాంతపోయాం. కెప్టెన్ అంటే కనీస గౌరవం కూడా లేకుండా కోచ్ మాట్లాడడం నాకు బాధకలిగించింద'ని టెండూల్కర్ రాశాడు. అయితే చాపెల్ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చానని సచిన్ పేర్కొన్నాడు.
చాపెల్‌ను దూరం పెట్టాలని...
చాపెల్ ప్రవర్తన నచ్చక కొన్ని రోజుల తర్వాత వరల్డ్‌కప్‌నకు గ్రెగ్‌ను జట్టుకు దూరంగా ఉంచాలని సలహా కూడా ఇచ్చినట్లు సచిన్ చెప్పాడు. సీనియర్ ఆటగాళ్లు జట్టు బాధ్యత తీసుకుంటారని బోర్డుకు చెప్పినట్లు సచిన్ తెలిపాడు. 'అయితే ఇదంతా జరగలేదు. 2007 వరల్డ్‌కప్‌లో భారత్ గ్రూప్ దశలోనే వెనుదిరిగింద'ని సచిన్ తన పుస్తకంలో రాసుకున్నాడు. ఆ వరల్డ్‌కప్‌లో భారత్ ప్రదర్శన అత్యంత దారుణమని, గ్రూప్ దశలో బెర్ముడాపై గెలిచినా.. బంగ్లా, శ్రీలంక చేతిలో ఓడి ఇంటి ముఖం పట్టిందని అన్నాడు.
'చాపెల్ హయాం లో భారత క్రికెట్ ఏమైపోతుందోనని మేమందరం కలవరపడే వాళ్లమంటే అతిశయోక్తి కాదు. కోచ్‌గా ఆటగాళ్లకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. మా నిబద్ధతనే ప్రశ్నించేవాడ'ని సచిన్ అన్నాడు. గంగూలీ వల్లే టీమిండియా కోచ్ కాగలిగినా.. జీవితాంతం అతనికి దాసోహం అనలేనని చాపెల్ చెప్పినట్లు సచిన్ తెలిపాడు. భారత క్రికెట్‌లో గంగూలీ ఓ ఆణిముత్యమని, చాపెల్ దయాదాక్షిణ్యాలపై అతను ఆధారపడాల్సిన పనిలేదని సచిన్ రాసుకున్నాడు.
లక్ష్మణ్‌ను హెచ్చరించాడు
చాలా మంది సీనియర్ ఆటగాళ్లను సాగనంపాలని చాపెల్ నిరంతరం ప్రయత్నించేవాడు. 'జట్టులో ఐక్యతను దెబ్బ తీసి సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టాలన్న ఆలోచనతో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో వీవీఎస్ లక్ష్మణ్‌ను ఓపెనర్‌గా దిగమని చెప్పాడు. కానీ ఓపెనర్‌గా తన ఆటతీరు అంతగా ఆకట్టుకోలేదని చెప్పి లక్ష్మణ్ సున్నితంగా తిరస్కరించాడు. తనను మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గానే పరిగణించమని చాపెల్‌ను కోరాడు. దీనికి గ్రెగ్ స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది. '32 ఏళ్ల వయస్సులో జట్టులోకి రావడం అంత సులభం కాదని, జాగ్రత్తగా ఉండాలని లక్ష్మణ్‌ను హెచ్చరించినట్లు' మాస్టర్ తన ఆత్మకథలో రాశాడు.