క్రికెటర్లపై ఉగ్రవాదుల తూటాలు..ఆ పీడకలకు పదేళ్లు

లాహోర్: రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొనడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయి. కులాలు, మతాలు, ప్రాంతాలు, దేశాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడలను, క్రీడాకారులను ఆదరిస్తారు. తమవారిగా అక్కున చేర్చుకుంటారు. ఇక్కడ భావోద్వేగాలకే తప్ప మనస్పర్థలకు తావుండదు. ఐపీఎల్ దీనికి ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి క్రీడారంగానికి మాయని మచ్చ.. పదేళ్ల కిందటి ఘటన. క్రికెట్ ఆడటానికి పాకిస్తాన్ కు వచ్చిన శ్రీలంక క్రికెట్ జట్టుపై మిలిటెంట్లు కాల్పులు జరిపి, విధ్వంసానికి తెగబడిన దారుణ ఘటనకు ఆదివారం నాటితో పదేళ్లు నిండాయి.
సరిగ్గా పదేళ్ల కిందట.. అంటే 2009 మార్చి 3వ తేదీన పాకిస్తాన్ లోని లాహోర్ లో ఉన్న గడాఫీ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్న క్రికెటర్లపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో క్రికెటర్లకు ప్రాణాపాయం తప్పినప్పటికీ.. ఎనిమిది మంది పౌరులు మృత్యువాత పడ్డారు. రిజర్వ్ అంపైర్ ఎహసాన్ రజా తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరంలోకి ఓ బుల్లెట్లు దూసుకెళ్లింది. కాలేయాన్ని ఛిద్రం చేసింది. కాల్పుల ఫలితంగా కోమాలోకి వెళ్లిన రజా.. రెండేళ్ల కిందట కోలుకున్నారు. మళ్లీ స్టేడియంలో అడుగు పెట్టారు. నాటి పీడకలను రజా గుర్తు చేసుకున్నారు. తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు.
మహేల జయవర్ధనే కేప్టెన్సీలో శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో రెండో టెస్ట్ ఆడాల్సి ఉంది. ప్రత్యేక బస్సులో స్టేడియానికి చేరుకున్న శ్రీలంక క్రికెటర్లను టార్గెట్ గా చేసుకుని మిలిటెంట్లు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో స్టేడియం వద్ద పహారా కాస్తున్న ఆరుమంది పోలీసులు, మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇద్దరు ప్రేక్షకులు హతమయ్యారు.
థిల్లాన్ సమరవీర, కుమార సంగక్కర, తరంగ పరణవితణ, అజంతా మెండీస్, చామిందా వాస్, మహేల జయవర్ధనే, సురంగ లక్మల్ గాయపడ్డారు. బస్సు వెనుకే మరో వాహనంలో వస్తున్న అంపైర్లపై జరిపిన కాల్పుల్లో ఎహసాన్ రజాకు తీవ్ర గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ క్రికెటర్లకు ప్రాథమిక చికిత్స చేశారు. రజాను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తరువాత రజా కోమాలోకి వెళ్లిపోయారు. రెండేళ్ల కిందటే పూర్తిగా కోలుకున్న రజా.. మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టారు.

గాయాలు మానిపోయాయి గానీ..
గడాఫీ స్టేడియంపై కాల్పుల ఘటనకు పదేళ్లు పూర్తయిన సందర్భంగా రజా తన చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. తన గాయాలు మానిపోయాయి గానీ.. నాటి పీడకలను మరిచిపోలేకపోతున్నానని చెప్పారు. ఆదివారం ఆయన తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. ఆ ఘటన తనను మాత్రమే కాదని, పాకిస్తాన్ క్రికెట్ ఉజ్వల భవిష్యత్తును కూడా నాశనం చేసిందని చెప్పారు. అంతర్జాతీయంగా పాకిస్తాన్ కు చెడ్డపేరు తీసుకొచ్చిందని, దశాబ్దం తరువాత కూడా క్రికెట్ ఆడే అనేక దేశాలు పాకిస్తాన్ లో పర్యటించడానికి విముఖత చూపుతున్నాయని రజా ఉద్ఘాటించారు.

పాక్ క్రికెట్ బోర్డు ఆదాయన్ని దెబ్బకొట్టిన ఉదంతం..
కాల్పుల ఉదంతం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆదాయాన్ని దారుణంగా దెబ్బతీసింది. స్వదేశంలో, సొంత గడ్డ మీద, సొంత ప్రేక్షకుల మధ్య హోరాహోరీగా తలపడాల్సిన మ్యాచ్ లను తటస్థ వేదికల్లో ఆడాల్సి వచ్చింది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు. దీనివల్ల భారీ ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. దీని విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2015లో జింబాబ్వేతో సిరీస్ ను పక్కన పెడితే.. ఈ దశాబ్ద కాలంలో స్వదేశంలో పాకిస్తాన్ ఆడిన అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు నామమాత్రమే. 2015 నాటి జింబాబ్వే సిరీస్ తో అంపైర్ రజా మళ్లీ పునరాగమనం చేయడం గమనార్హం. న్యూజీలాండ్, ఆస్ట్రేలియాలు మాత్రం పాక్ లో క్రికెట్ ఆడటానికి సాహసించట్లేదు. గత ఏడాది ఓ టీ20 సిరీస్ ను న్యూజీలాండ్ పాకిస్తాన్ లో ఆడాల్సి ఉంది. న్యూజీలాండ్ అంగీకరించకపోవడం తటస్థ వేదికలపై ఆ మ్యాచ్ లు ఏర్పాటయ్యాయి. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా అంతే. పాకిస్తాన్ తో ఆ దేశ సొంత గడ్డపై రెండు వన్డే మ్యాచ్ లను ఆడాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా దీనికి అంగీకరించలేదు.

రెండేళ్లుగా పరిస్థితిలో మార్పు..
పాకిస్తాన్ లో క్రికెట్ ఆడే దేశాల సంఖ్య రెండేళ్లుగా క్రమంగా మెరుగుపడుతూ వస్తోంది. ఇటీవలే వెస్టిండీస్.. పాకిస్తాన్ లో మూడు టీ20 మ్యాచ్ లను ఆడింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచులు ఆ దేశ క్రికెట్ కు పునర్వైభవాన్ని తెచ్చి పెడుతున్నాయని పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్ చెప్పారు. సమీప భవిష్యత్తులో మరిన్ని జట్లు తమ దేశానికి వచ్చి క్రికెట్ ఆడతాయని ఆశిస్తున్నానని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications