జూబ్లీహిల్స్ నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీమిండియా మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన త్రిష ను సత్కరించి అభినందించారు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి. అలానే ఆమెకు రూ. కోటి రూపాయల నజరానా ప్రకటించారు. భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్స్ అయిన, తెలంగాణ కు చెందిన ధృతి కేసరికి రూ.10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్,ట్రైనర్ షాలినికి రూ.10 లక్షల చొప్పున నజరానాను ప్రకటించారు. ఈ టీ20 ప్రపంచక్ టోర్నీ ప్రారంభం నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో త్రిష క్రికెట్ అభిమానులను ఆకట్టుకోవడంతో పాటు.. టీమిండియా కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.

309 పరుగులు.. 7 వికెట్లు
మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భారత అమ్మాయిలు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి వరుసగా రెండో సారి ఛాంపియన్ గా నిలిచారు. ఈ కప్ సాధించడంలో గొంగడి త్రిష కీలక పాత్ర పోషించింది. బ్యాట్, బంతితో ఆల్ రౌండ్ షో చేసి ఆకట్టుకుంది. తుది పోరులో 33 బంతుల్లో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. బౌలింగ్ లోనూ 3 వికెట్లు తీసింది. మొత్తంగా ఈ టోర్నీలో 77.25 సగటుతో 309 పరుగులు చేసింది త్రిష. ఇందులో ఓ అజేయ శతకం కూడా ఉంది. బౌలింగ్‌లో 7 వికెట్లు తీసి ఆకట్టుకుంది.
హైలైట్ గా సెంచరీ
త్రిష బాదిన సెంచరీ ఈ టోర్నీ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. జనవరి 28వ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో త్రిష ఈ శతకాన్ని నమోదు చేసింది. తద్వారా అండర్ 19 మహిళల ప్రపంచ కప్ చరిత్రలో సెంచరీ బాదిన తొలి బ్యాటర్ గా రికార్డు సృష్టించింది.