
ముంబై: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. బీసీసీఐ. క్రికెట్ ఆడే దేశాలన్నింట్లోకీ అత్యంత ధనికవంతమైనది. రిచ్చెస్ట్ బోర్డుగా పేరుంది దీనికి. స్పాన్సర్ల రూపంలో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అలాంటి బోర్డు.. భారత మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్‌మనీని సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకుని ఉందంటే నమ్మగలరా?. ఇది నిజం. టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి ఇన్ని నెలల పాటు కాలయాపన చేసింది. చివరికి- విదేశీ మీడియా వేలెత్తి చూపితే గానీ- కళ్లు తెరచుకోలేదు.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడంతో బీసీసీఐ దిగొచ్చింది. ఎట్టకేలకు ఆ ప్రైజ్‌మనీని విడుదల చేసింది. ఈ మేరకు టీమిండియా విమెన్స్ జట్టుకు సమాచారాన్ని పంపించింది. తమ ఇన్‌వాయిస్‌లను పంపించాల్సిందిగా సూచించింది. గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియా వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-ఆసీస్ జట్లు తలపడ్డాయి. భారత జట్టు ఓడిపోయింది. రన్నరప్‌గా నిలిచింది. రన్నరప్‌గా నిలిచినందుకు టీమిండియా విమెన్స్ జట్టుకు సుమారు మూడున్నర కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ దక్కింది.
టోర్నమెంట్ ముగిసిన రెండో నెలలోనే ఐసీసీ ఈ అమౌంట్‌ను విడుదల చేసింది. బీసీసీఐకి కేటాయించింది. ఆ మొత్తాన్ని బీసీసీఐ టీమ్ మెంబర్లకు విడుదల చేయలేదు. తన వద్దే అట్టి పెట్టుకుంది. దీనిపై విదేశీ స్పోర్ట్స్ పోర్టల్స్ ప్రత్యేక కథనాలు రాశాయి. స్పెషల్ స్టోరీలను ప్రచురించాయి. నిబంధనలకు అనుగుణంగా ఐసీసీ సకాలంలో ప్రైజ్‌మనీనీ విడుదల చేసినట్లు నిర్ధారించాయి. దీనికోసం అవి ఐసీసీ అధికారుల పేర్లను ఉటంకించాయి. ఇన్ని నెలల తరువాత కూడా మహిళా జట్టుకు ప్రైజ్‌మనీని అందజేయకపోవడం పట్ల ఒక్కసారిగా బీసీసీఐ విమర్శలను ఎదుర్కొంది.
మహిళలు అనే వివక్షతను బీసీసీఐ ప్రదర్శిస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనితో మెట్టు దిగక తప్పలేదు. ప్రైజ్‌మనీని అందజేస్తామని టీమ్ మెంబర్లకు సమాచారాన్ని అందజేసింది. ఇన్‌వాయిస్‌లను పంపించాల్సిందిగా కోరింది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని మహిళల జట్టులో ఒక్కో మెంబర్‌కు 18,65,556 రూపాయలు అందుతుంది. ఇన్‌వాయిస్ తమకు అందిన వెంటనే- వారి వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లలోకి ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తామని బీసీసీఐ వివరణ ఇచ్చినట్లు సమాచారం.