
న్యూఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్. అతను క్రీజ్‌లో ఉంటే.. బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయి. ఎలాంటి బంతినైనా ఫెన్సింగ్ దాటించగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్. బౌలర్లపై జాలి, దయ అనేదే చూపించడు. తన భారీ షాట్లతో కన్నీళ్లు పెట్టిస్తాడు. అలాంటి బ్యాట్స్‌మెన్‌ను కూడా కలచి వేసింది ఓ వైరల్ ఫొటో. కంట్లో నీళ్లు రప్పించింది. ఇకపై అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనిపించేలా తనవంతు సహాయాన్ని అందించేలా సెహ్వాగ్‌ను ప్రోత్సహించింది. అతనికి స్ఫూర్తినిచ్చిందా పిక్. ఆక్సిజన్ కొరతను నివారించడానికి ముందుకొచ్చేలా చేసింది.
ఓ గృహిణి.. ముఖానికి ఆక్సిజన్ మాస్క్‌ను ధరించి వంట వండుతోన్న ఫొటో అది. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడంతో ఇంట్లోనే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ సపోర్ట్ తీసుకుంటూ.. వంట వండుతూ కనిపించిన ఫొటో అది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పెద్ద ఎత్తున డిబేట్ నడిచింది. శ్రీపాద చిన్మయి వంటి పలువురు సెలెబ్రిటీలు దీనిపై స్పందించారు. అమ్మ ఎప్పుడు అమ్మే అంటూ ట్వీట్లు చేశారు. తన పిల్లల కోసం అమ్మ దేన్నీ లెక్క చేయదనే సందేశాన్ని ఇచ్చినట్టయిందంటూ కామెంట్స్ చేశారు.
తాజాగా ఇదే ఫొటోను వీరేంద్ర సెహ్వాగ్ రీట్వీట్ చేశారు. ఈ ఫొటో చూసిన తరువాత కన్నీళ్లు ఆగలేదని చెప్పాడు. తనను కలచివేసిందని వ్యాఖ్యానించాడు. అమ్మ అమ్మే, ఆమెకు ఎవరూ సాటి రాబోరంటూ ట్వీట్ చేశాడు. ఇలాంటి దుస్థితి మరెవరికీ రాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తు చేశాడు. ఢిల్లీలో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల కొరత ఉందనే విషయాన్ని ఈ ఫొటో మరీ మరీ గుర్తు చేస్తోందని, దీన్ని అధిగమించడానికి తమవంతు సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఆక్సిజన్ కొరతను తీర్చడానికి వీలైనంత సహాయం చేయాలని సూచించారు. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ అవసరమైన వారు వాట్సప్ మెసేజ్ పంపించాలని సూచించాడు. దీనికోసం ఓ వాట్సప్ నంబర్ లింక్‌ను అతను తన ట్వీట్‌కు జత చేశాడు.