కరాచీ: ఐదేళ్ల క్రితం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐదేళ్లు నిషేధానికి గురైన పాకిస్థాన్ క్రికెటర్ సల్మాన్ భట్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అసలు ఆ సమయంలో ఫిక్సింగ్ అంశానికి దూరంగా ఉండాల్సిందంటూ తన సహచరుడు షాహిద్ ఆఫ్రిది ముందు కంటతడి పెట్టాడు.
గురువారం సాయంత్రం ఆఫ్రిదీని వ్యక్తిగతంగా కలిసిన సల్మాన్ భట్ తనను క్షమించాల్సిందిగా వేడుకున్నాడు. 2010లో ఇంగ్గాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ఫిక్సింగ్ ఆరోపణలు వెలుగు చూశాయి. దీనికి అప్పటి టెస్టు కెప్టెన్ సల్మాన్ భట్‌తో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు ఫిక్సింగ్ పాల్పడిట్లు ఆరోపణలు రావడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.

కాగా, సల్మాన్ భట్ పై ఐసీసీ విధించిన ఐదు సంవత్సరాల సస్పెన్షన్ వేటు సెప్టెంబర్ 1వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో జరిగే దేశవాళీ మ్యాచుల్లో ఆడేందుకు సల్మాన్ భట్‌కు పీసీబీ అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ట్వంటీ 20 పాక్ జట్టు కెప్టెన్ ఆఫ్రిదిని సల్మాన్ భట్ కలిశాడు.
'కనీసం ఆ సమయంలో నీ సలహా అయిన తీసుకోవాల్సింది. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఫిక్సింగ్ ఉదంతం వెలుగు చూసింది. అందుకు నన్ను క్షమించండి' అంటూ ఆఫ్రిదీని భట్ వేడుకున్నాడు. దీనిపై ఆఫ్రిది స్పందిస్తూ గతంలో జరిగిపోయిన దాన్ని వదిలి పెట్టి క్రికెట్‌పై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చాడు.