
హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంలో ప్రధాన పాత్రదారులైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం దాదాపుగా ఖరారైంది. క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం అధికారికంగా ప్రకటించడమే తరువాయి అంటోంది ఆస్ట్రేలియా మీడియా. కేప్‌టౌన్‌లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్‌లు బోర్డుకు అందించిన నివేదిక ఆధారంగా స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోనున్నారు.
ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు, కోచ్ లీమన్‌తో పాటు సహాయక సిబ్బందినీ ప్రశ్నించిన అనంతరం రాయ్ నివేదికను రూపొందించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బసచేసిన హోటళ్లోనూ కీలక సమాచారం సేకరించాడు. ఈ బాల్ టాంపరింగ్ వెనుక మాస్టర్ మైండ్ ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నట్లు విచారణలో వెల్లడైందని ఆసీస్ మీడియా రాసుకొచ్చింది.
మొదట ఈ ఆలోచన చేయడంతో పాటు దీనికి ఓపెనర్ బాన్‌క్రాప్ట్‌ను పురమాయించింది కూడా వార్నరే అన్న ఆరోపణలు వస్తున్నాయి. తన పథకాన్ని స్మిత్‌కు చెప్పగా అతను కూడా గుడ్డిగా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దాంతో జట్టంతా కలిసి ఈ పని చేయలేదని.. స్మిత్ ఆమోదంతో వార్నర్ సూత్రధారిగా.. బాన్‌క్రాఫ్ట్ పాత్రధారిగా టాంపరింగ్‌కు తెరలేచినట్టు తెలుస్తోంది.
బాల్ టాంపరింగ్ పాల్పడుతున్నామనే విషయం సీనియర్ పేసర్లు మిచెల్ స్టార్క్, హాజెల్‌వుడ్‌తో పాటు స్పిన్నర్ నాథన్ లియాన్‌కు కూడా తెలియదట. ఈ విషయాన్ని సదరు ఆటగాళ్లే టాంపరింగ్ ఘటనను విచారిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులకు చెప్పారని సమాచారం. దీంతో, ఆసీస్ జట్టులో తీవ్ర విభేదాలు పొడచూపాయని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం పూర్తిగా దెబ్బతింది.
డేవిడ్ వార్నర్‌పై తాము నమ్మకం పూర్తిగా కోల్పోయామని, ఇకపై అతనితో కలిసి మైదానంలోకి దిగేదిలేదని క్రికెట్ ఆస్ట్రేలియాకు తేల్చి చెప్పారట. వార్నర్ తన తప్పును కప్పి ఉంచేందుకు.. శిక్షను తగ్గించుకునేందుకు టాంపరింగ్ నెపాన్ని అందరిపై నెట్టినందుకు జట్టులోని సహచరులు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో టీమ్ బస చేసిన హోటల్‌లో సోమవారం రాత్రి డేవిడ్ వార్నర్ తన క్రికెటేతర స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. జట్టు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా వార్నర్ మందు పార్టీని చేసుకోవడాన్ని సహచర ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో ఆ 'రోగ్' వార్నర్‌ను వెంటనే హోటల్ రూమ్ నుంచి బయటికి గెంటేయాలని క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. డేవిడ్‌ను హోటల్ నుంచి పంపించకపోతే.. ఆగ్రహంగా ఉన్న క్రికెటర్లు అతనితో ఘర్షణకు దిగే అవకాశం కూడా ఉందని చెప్పినట్టు ఆస్ట్రేలియాకు చెందిన ఫైర్‌ఫాక్స్ న్యూస్ పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఆసీస్ ప్లేయర్ల వాట్సప్ గ్రూప్ నుంచి వార్నర్ వైదొలగడం విశేషం.
బాల్ టాంపరింగ్‌కు పాల్పడదామని చర్చ ముందుగా వార్నర్, బాన్‌క్రాప్ట్ మధ్యనే వచ్చిందని, దీనికి గురించి తనకు చెప్పినప్పుడు వారించకుండా స్మిత్ గుడ్డిగా ఓకే చెప్పాడని క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ అధికారుల ముందు ఆటగాళ్లు చెప్పారు. అందుకే ఆసీస్ జట్టులో కీలకమైన ఫాస్ట్ బౌలర్లు తమకు టాంపరింగ్ విషయం గురించి తెలియదని విచారణ అధికారులకు చెప్పారు.
బాల్ టాంపరింగ్‌కు బాధ్యత వహిస్తూ అతను విచారణ అధికారులతో పాటు జట్టు సహచరులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాడని ఆసీస్ మీడియా పేర్కొంది. వార్నర్ వల్లే ఈ బాల్ టాంపరింగ్ జరిగిందని సీఏ అధికారులు తమ విచారణలో నిర్థారిస్తే.. స్మిత్‌కు తక్కువ శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, అతనికి రెండో చాన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో సీఏ ఉన్నట్టు ఆసీస్ మీడియా చెబుతోంది.
విచారణ అధికారుల నివేదిక ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సదర్లాండ్ బుధవారం అధికారిక ప్రకటన చేయనున్నాడు. అయితే, ఆస్ట్రేలియా మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం స్మిత్, వార్నర్‌పై ఏడాది పాటు నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి.