టీమిండియా కొత్త కెప్టెన్ ను ఎంపిక చేసే విషయంలో ప్రధాన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ.. తమ కెరీర్ చివరి దశకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. పైగా రోహిత్ కూడా తాను ఇంకొంత కాలమే సారథిగా కొనసాగుతానని, కొత్త కెప్టెన్ ను వెతకమని బీసీసీఐకి చెప్పేశాడు. దీంతో ఇప్పుడు టీమిండియా కొత్త కెప్టెన్ ఎంపిక బీసీసీఐకి పెద్ద సవాల్ గా మారింది. బోర్డులో నూతన సారథి ఎవరనే విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇదే విషయమై బీసీసీఐలో అంతర్గత విభేదాలు కూడా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

రోహిత్ శర్మ తర్వాత అతడి వారసుడిగా బుమ్రాకు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని మొదట ప్రచారం సాగింది. కానీ తాజా రివ్యూ మీటింగ్ లో... బుమ్రా తరచుగా గాయలబారిన పడుతుండటం వల్ల అతడిని ఎంపిక చేసే విషయమై కొంతమంది విముఖత చూపారట. దీంతో అతడికి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నారట.
ఈ క్రమంలోనే లాంగెస్ట్ ఫార్మాట్ లో కెప్టెన్ గా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ పేర్లను పరిశీలిస్తున్నారని ప్రచారం మొదలైంది. అయితే ఇదే సమయంలో కెప్టెన్ ఎంపిక విషయమై అగార్కర్ రిషభ్ పంత్ పేరును సూచింగగా, గంభీర్ యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ పేరును సూచించాడని తెలిసింది. ఇప్పుడు ఇదే అంశం అగార్కర్, గంభీర్ నేతృత్వంలోని సెలక్టర్స్, కోచింగ్ స్టాఫ్ మధ్య విభేదానికి దారీ తీసిందని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
వన్డే కెప్టెన్సీపై కూడా చర్చలు
టెస్ట్ కెప్టెన్సీతో పాటు వన్డే కెప్టెన్సీపై కూడా చర్చలు సాగుతున్నాయట. టీ20 కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ నే వన్డే కెప్టెన్ గా ఎంపిక చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయట. కానీ వన్డేల్లో సూర్యకుమార్ ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయట్లేదని, అందుకే సూర్యకు వన్డేల బాధ్యతను అప్పగించడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సమాచారం అందింది.