
అక్టోబర్ 2వ తేదీన దక్షిణాఫ్రికాతో రెండో టీ20 కోసం గౌహతి చేరుకున్న భారత క్రికెటర్లకు అదిరిపోయే వెల్ కం దక్కింది. త్రివేండ్రంలోని మునుపటి వేదిక మాదిరిగానే టీమ్ బస్సును భారత క్రికెట్ అభిమానులు చుట్టుముట్టారు. గత మ్యాచ్‌లో అబ్బురపరిచిన బౌలర్లు దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ కోసం ప్రత్యేకంగా కేక్ అరెంజ్ చేశారు. వారిద్దరు కేక్ కోశారు. ఇక క్రికెటర్లను ఫోటోలు తీస్తూ.. చీర్స్ చేస్తూ అభిమానులు సందడి చేసిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20లో దీపక్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ స్వింగ్ బంతులకు దక్షిణాఫ్రికా టాపార్డర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ధాటికి కేవలం 9పరుగులకే దక్షిణాఫ్రికా 5వికెట్లు కోల్పోయింది.
వీరిద్దరి ప్రదర్శన వల్ల దక్షిణాఫ్రికా తక్కువ మొత్తానికే పరిమితం కాగా.. ఛేజింగ్‌లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తొందరగా ఔటవ్వడంతో కాస్త ఉత్కంఠ రేకెత్తింది. అయితే సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలతో దక్షిణాఫ్రికాకు మళ్లీ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆ మ్యాచ్ భారత్ గెలుపొందింది. ఇకపోతే సిరీస్ ఓపెనర్‌లో భారత్ ఘన విజయం అనంతరం రెండో టీ20 గాంధీ జయంతి రోజున గౌహతిలో జరగనుండడంతో గౌహతిలో ఆ రాష్ట్ర క్రికెట్ బోర్డు టీమిండియా ప్లేయర్లకు అద్భుతమైన వెల్ కమ్ చెప్పింది. తొలతు ఫాస్ట్ బౌలింగ్ ద్వయం అయిన అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ చేత హోటల్ వద్ద కేక్ కట్ చేయించారు. ఎయిర్ పోర్టులో, హోటల్ వద్ద ప్రత్యేకంగా శాలువాలు కప్పి టీమిండియా ప్లేయర్లను ఆహ్వానించారు. సంప్రదాయ నాట్యంతో స్వాగతించారు.
ఇకపోతే జస్‌ప్రీత్ బుమ్రా తొలి టీ20కి ముందు ప్రాక్టీస్ సెషన్లో బ్యాక్ ఫ్రాక్చర్ మరింత తిరగబెట్టడంతో ఈ సిరీస్‌తో పాటు రాబోయే ఐసీసీ టీ20 టోర్నమెంట్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ఇక బుమ్రా గాయం తీవ్రత భారీగా ఉండడంతో అతను 4నుంచి 6నెలల పాటు ఆటకు దూరం కావాల్సొచ్చింది. ఇకపోతే బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం సెలెక్షన్ కమిటీ జట్టులోకి తీసుకుంది. బుమ్రా గాయపడడంతో టీ20 ప్రపంచకప్ కోసం అతని స్థానంలో ఎంపికకావడానికి పోటీలో చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. అందులో దీపక్ చాహర్, మహమ్మద్ షమీ, సిరాజ్ ముఖ్యమైన వారు.