
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక మంగళవారం ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య సూపర్ ఫోర్ మ్యాచ్ ముందు భారత్‌ను ప్రశంసించాడు.అంతర్జాతీయ వేదికపై జట్లను ఓడించడంలో రోహిత్ శర్మ, టీమిండియా ప్లేయర్ల మనస్తత్వం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాడు. ఇకపోతే రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకమే. ముఖ్యంగా భారత్‌కు చాలా కీలకం.
ఇండియా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఓటమి పాలవడంతో మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్‌పై గెలుపొంది టేబుల్ టాపర్‌గా అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా బాగుంది. భారత జట్టుకు రవీంద్ర జడేజా దూరం కావడంతో జట్టు కూర్పు విషయంలో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. ఇకపోతే వరుసగా విజయాలతో సత్తా చాటిన శ్రీలంక ఇదే ఆత్మవిశ్వాసంతో భారత్‌ను ఓడించాలని చూస్తుంది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందు మాట్లాడిన శ్రీలంక కెప్టెన్ దసున్ షనక.. భారత ఆటగాళ్లకు ఐపీఎల్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆడిన అనుభవం చాలా ఉందని చెప్పాడు. అంతర్జాతీయ వేదికపై జట్లను ఓడించడానికి ఇండియా అనేక వ్యూహాలు పన్నుతుందని, టీమిండియా విన్నింగ్ మెంటాలిటీ, ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ బట్టి ఆ విషయం అర్థమవుతుందని షనక వ్యాఖ్యానించాడు. అయితే తమ జట్టు కూడా బాగా సన్నద్ధంగా ఉందని, మంగళవారం జరిగే పోరు కోసం ఎదురు చూస్తున్నామని, భారత్ వైపు నుంచి ఎలాంటి ప్లేయర్ బరిలోకి దిగినా మేం ఎదుర్కొంటామని చెప్పాడు.
'మా జట్టుతో తలపడుతున్నప్పుడు భారత్ ఎలాంటి ఒత్తిడికి గురికాదని భావిస్తున్నా. ఎందుకంటే ఆదివారం నాటి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా చివర్లో ఓడిపోయింది గానీ ఆ మ్యాచ్ మొత్తం మంచి ప్రదర్శనే కనబర్చింది. గతంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో శ్రీలంక అనుసరించిన విధానాన్నే ఇప్పుడు అవలంబిస్తాం. ఇక ఇండియాతో మ్యాచ్ అయినప్పటికీ.. మా విధానం ఇతర మ్యాచ్‌ల మాదిరిగానే ఉంటుంది. మేం మా పాజిటివ్ ఇంటెంట్‌తో ఆడుతాం' అని షనక చెప్పాడు.