యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ కెరీర్ ముగియడానికి టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లినే కారణమని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైన నేపథ్యంలో... గతంలో(2019) తాను జట్టు నుంచి ఎలా తప్పించబడ్డాడో యూవీ గుర్తుచేసుకున్న వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం వైరల్ అయ్యాయి. అందులో యూవీ అప్పటి సెలక్షన్ కమిటీపై విమర్శలు గుప్పించాడు.
"ఛాంపియన్స్ ట్రోఫీ 2017 తర్వాత నేను ఆడిన 8-9 మ్యాచులు ఆడాను. అందులో 2 గేమ్‌లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాను. దీంతో నేను జట్టును నుంచి తప్పించబడతానని ఎప్పుడూ అనుకోలేదు. అప్పుడు నేను గాయపడ్డాను. అయితే నన్ను శ్రీలంక సిరీస్ కోసం సిద్ధం కావాలని అన్నారు. అకస్మాత్తుగా, యో-యో పరీక్ష ఉంటుందని చెప్పారు. సడెన్ గా నా 36 ఏళ్ల వయసులో యో-యో టెస్ట్‌కు సిద్ధం కావాల్సి వచ్చింది. యో-యో టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత కూడా, దేశవాళీ క్రికెట్ ఆడాలని నాకు చెప్పారు. కానీ వాస్తవానికి వాళ్లు యోయో టెస్ట్ పేరుతో నన్ను పక్కకు పెట్టాలని అనుకున్నాను. ఎందుకంటే నా వయసు రీత్యా నేను ఆ పరీక్షలో పాస్ అవ్వనని భావించారు. పాస్ అవ్వకపోతే నన్ను సులభంగా పక్కన పెట్టొచ్చని అనుకున్నారు. కానీ అలా జరగలేదు." అని పేర్కొన్నాడు.

అయితే 2017లో శ్రీలంక టూర్ కు ముందు సెలక్టర్లు యువరాజ్ సింగ్ ను పక్కకు పెట్టేశారు. అలా యూవీ అంతర్జాతీయ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడింది. దీని గురించి యూవీ మాట్లాడుతూ.. "15-17 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్ ఆడిన ప్లేయర్ కు, మళ్లీ క్రికెట్ ఆడకుండా ఖాళీగా ఉండటం అనేది దురదృష్టకరం. అయితే నాకు ఎవ్వరూ కూడా ఈ విషయం(పక్కనపెడుతున్నట్లు) గురించి చెప్పలేదు. సెహ్వాగ్, జహీర్ ఖాన్ కూడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ప్లేయర్ ఎవరైనా సరే.. మేము యంగ్ స్టర్స్ కోసం చూస్తున్నాం.అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పాలి. ఏదేమైనా సీనియర్లను తొలిగించి కొత్త వారిని ప్రోత్సాహించడం అనేది
సరైనదే." అంటూ పరోక్షంగా అప్పటి సెలక్షన్ కమిటీపై విమర్శలు చేశాడు.