ఎట్టకేలకు టీ20 వరల్డ్ కప్ భారత్ గడ్డకు చేరింది. 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణ తెరపడిన అయిదు రోజులకు ఇంటికొచ్చింది. విశ్వవిజేతగా నిలిచి స్వదేశానికి చేరుకున్న రోహిత్‌సేనకు అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. గురువారం ఉదయం ఆరు గంటలకు ప్రత్యేక విమానంలో భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి నుంచే ఎయిర్‌పోర్టులో వేచి ఉన్న అభిమానులు భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికారు. మరోవైపు టీమిండియా కూడా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచింది. ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో భారత ఆటగాళ్లు అలరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశారు.

అయితే హోటల్‌లో కాసేపు సేద తీరిన అనంతరం టీమిండియా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడానికి వెళ్లారు. ఉదయం 11 గంటలకు మోదీని కలుసుకున్నారు. ప్రధానితో కలిసి అల్ఫాహారం తిన్నారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేనను మోదీ అభినందించారు. కాగా, మోదీని కలవడానికి భారత ఆటగాళ్లు స్పెషల్ జెర్సీ ధరించారు. టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన జెర్సీ తరహాలోనే స్పెషల్ జెర్సీని డిజైన్ చేసి స్వల్ప మార్పులు చేశారు.
జెర్సీ ముందు భాగంలో 'ఇండియా' కింద 'ఛాంపియన్స్' అని టెక్స్ట్ వచ్చింది. టీ20 వరల్డ్ కప్-2024 గెలిచామని ఛాంపియన్‌ను జెర్సీలోకి తీసుకువచ్చారు. అలాగే ఎడమవైపు ఉండే బీసీసీఐ లోగోపై రెండు స్టార్లను ముద్రించారు. గతంలో కేవలం ఒక్క స్టార్ మాత్రమే ఉండేది. 2007 టీ20 వరల్డ్ కప్ విజయానికి గుర్తు స్టార్ ఉండేది. 2024 కప్ రాకతో రెండు స్టార్లుగా ఛేంజ్ చేశారు. భారత ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీని ధరించి ప్రధాని మోదీని కలుసుకున్నారు.
కాగా, భారత జట్టు కాసేపటిలో ముంబైకి బయల్దేరుతుంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. రెండు గంటల పాటు ఊరేగింపు జరగనుంది. గతంలో ధోనీ సేన పాల్గొన్నట్లుగానే ఓపెన్ టాప్ బస్సులో ప్రపంచ కప్పుతో టీమిండియాకు అభిమానులకు అభివాదం చేయనుంది. అంతేగాక రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం జరగనుంది.