India Palying XI: ఊహించినట్టుగానే టీ20 సిరీస్ వన్ సైడ్‌గా మారింది. తొలి రెండు టీ20ల్లో అఫ్గానిస్థాన్ భారత్ చిత్తుగా ఓడించింది. మొహాలి వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆరు వికెట్లు తేడాతో గెలిచిన టీమిండియా.. ఇండోర్‌లో జరిగిన రెండో టీ20లోనూ ఘన విజయం సాధించింది. జనవరి 17న బెంగళూరు వేదికగా జరగనున్న సిరీస్‌లోని ఆఖరి పోరుకు రోహిత్ సేన సిద్ధమైంది.
అయితే ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతోంది. కానీ జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే ఆఖరి టీ20 మ్యాచ్ ఇదే.ఈ నేపథ్యంలో పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు అవకాశాలు పొందిన యువప్లేయర్లు సత్తాచాటుతుండంతో జట్టు కూర్పుపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏ ప్లేయర్‌కు అవకాశం ఇవ్వాలి, ఎవరికి మొండిచేయి చూపించాలి అనే స్థితితో.. టీమిండియా మేనేజ్మెంట్‌పైనే ఒత్తిడి నెలకొన్న పరిస్థితి ఎదురైంది.

అయితే గత రెండు టీ20ల్లో బెంచ్‌కే పరిమితమైన ప్లేయర్లకు బెంగళూరు మ్యాచ్‌లో అవకాశం దక్కే ఛాన్స్‌లు ఉన్నాయి. 14 నెలల తర్వాత టీ20ల్లోకి తిరిగొచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తుదిజట్టులో కొనసాగుతారు. అయితే కోహ్లి దూకుడుగా ఆడుతూ అదిరే రీఎంట్రీ ఇవ్వగా, రోహిత్ వరుసగా డకౌట్లుగా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఆఖరి టీ20లో విజృంభించి సత్తా చూపించాలని వారిద్దరు కసిగా ఉన్నారు.
మరోవైపు అనారోగ్యం కారణంగా తొలి టీ20కు దూరమైన యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ రెండో మ్యాచ్‌లో అదరగొట్టాడు. ఆఖరి టీ20లోనూ రోహిత్‌కు జతగే అతడిని ఓపెనింగ్‌కు పంపించాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. దీంతో శుభ్‌మన్ గిల్‌కు నిరాశ తప్పేలా లేదు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఆల్‌రౌండర్ శివమ్ దూబె తన నాలుగో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
అయితే అయిదో స్థానంలో జితేశ్ శర్మకు బదులుగా సంజు శాంసన్‌కు అవకాశం దక్కేలా ఉంది. జితేశ్ తొలి మ్యాచ్ ఫర్వాలేదనిపించాడు. కానీ రెండో టీ20లో దూకుడుగా యత్నించి డకౌటయ్యాడు. బెంగళూరు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమవ్వడంతో సంజుకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక ఆరోస్థానంలో వస్తూ ఫినిషర్‌గా సత్తాచాటుతున్న రింకూ సింగ్‌ను, స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆఖరి టీ20లోనూ కొనసాగించనున్నారు.
కాగా, రెండు టీ20ల్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. వారిద్దరిలో ఒకరికి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే అవేశ్ ఖాన్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంటుంది. బెంగళూరులో ఇప్పటివరకు 17 అంతర్జాతీయ టీ20లు జరగగా, ఏడు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. తొమ్మిది సార్లు ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది.
భారత్ తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, శివమ్ దూబె, సంజు శాంసన్/జితేశ్ శర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్/అవేశ్ ఖాన్.