
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇంకొన్ని రోజుల్లో ముగియబోతోంది. ఆది, సోమ, బుధవారాల్లో ప్లేఆఫ్స్ ముగుస్తాయి. 15వ తేదీన ఫైనల్ ఉంటుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరాయి. ఇందులో ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్ ఇప్పటికే ఛాంపియన్‌గా ఆవిర్భవించాయి. ఈ సారి కొత్త జట్టు.. టైటిల్ గెలుచుకోవడానికీ అవకాశాలు లేకపోలేదు. ఢిల్లీ కేపిటల్స్ దూకుడు మీద ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సారి కప్ కొట్టి.. కేప్టెన్‌గా విరాట్ కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది.
ఫైనల్ మ్యాచ్ ముగిసిన రెండో రోజే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభమౌతుంది. తొలిదశలో క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఉంటాయి. అదే సమయంలో 18, 20వ తేదీల్లో వార్మప్ మ్యాచ్‌లు ఉంటాయి. టీమిండియా సహా పెద్ద జట్లన్నీ వార్మప్ మ్యాచ్‌లను ఆడతాయి. రెండేసి మ్యాచుల్లో తలపడతాయి. 18వ తేదీన నిర్వహించే వార్మప్ మ్యాచ్‌లల్లో ఆఫ్ఘనిస్తాన్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-వెస్టిండీస్, ఆస్ట్రేలియా-న్యూజిలాండ్, భారత్-ఇంగ్లాడ్ మధ్య పోరు ఉంటుంది. 20వ తేదీ నాటి మ్యాచ్‌లల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్, భారత్-ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా-పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్-వెస్టిండీస్ తలపడతాయి.
కాగా- ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ మేజర్ ఈవెంట్ కావడం వల్ల.. టీమిండియా కొత్త జెర్సీతో కనువిందు చేయనుంది. దీనికి సంబంధించిన జెర్సీ డిజైన్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఖరారు చేసింది. కొత్త జెర్సీని ఈ నెల 13వ తేదీన ఆవిష్కరించనుంది. ప్రస్తుతం టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచుల్లో భారత జట్టు ముదురు నీలం రంగు జెర్సీతో కనిపిస్తోన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరీస్ సందర్భంగా టీమిండియా కోసం బీసీసీఐ కొత్త జెర్సీని రూపొందించింది.
పాత తరం క్రికెటర్లను గుర్తుకు తీసుకొచ్చేలా అప్పట్లో ఈ జెర్సీని డిజైన్ చేసింది. ముదురు నీలం రంగు జెర్సీ ఇది. భుజాల వద్ద తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగులు వరుసలు ఉంటాయి. ఇదివరకు భారత క్రికెట్ జట్టు ధరించిన జెర్సీని పోలీ ఉంటుంది. దీని మీద ఎంపీఎల్ స్పోర్ట్స్ పేరును ముద్రిస్తారు. దీని స్థానంలో కొత్త జెర్సీ రానుంది. దీనికి కూడా ఎంపీఎల్ స్పోర్ట్స్ దీన్ని స్పాన్సర్ చేయనుంది. జెర్సీతో పాటు కిట్‌ను కూడా ఎంపీఎల్ స్పాన్సర్ చేస్తుంది.