టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి పదేళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి గొప్ప గొప్ప ప్లేయర్లు పుట్టుకొస్తున్నా.. వరల్డ్ కప్‌ను మాత్రం ముద్దాడలేకపోతోంది. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఫుల్ ఇంటెంట్‌తో బ్యాటింగ్ చేస్తామని చెప్పిన రోహిత్ సేన.. జిడ్డు బ్యాటింగ్‌తో తేలిపోయింది. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కూడా ఓడింది.
గత టీ20 వరల్డ్ కప్ తర్వాత సీనియర్లను పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉంచాలని బీసీసీఐ నిర్ణయించుకుంది. అప్పటి నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితరులను టీ20 సిరీసులకు ఎంపిక చేయలేదు. కొత్త కుర్రాళ్లతో మంచి టీంను తయారు చేసి 2024 టీ20 వరల్డ్ కప్ నెగ్గాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఈ ఫార్మాట్‌లో కొన్ని ప్రయోగాలు చేస్తోంది.

తాజాగా జరిగిన విండీస్ సిరీసులో కూడా తాము పొట్టి ప్రపంచకప్ కోసమే ప్రయోగాలు చేస్తున్నట్లు కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. కానీ ఈ సిరీసులో టీమిండియా ఏడుగురు బ్యాటర్ల టెంప్లేట్ కూడా బెడిసికొట్టింది. దీనిపై మాజీ లెజెండ్ వసీం జాఫర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదే టెంప్లేట్‌తో భారత్ కనుక వచ్చే టీ20 వరల్డ్ కప్ ఆడితే ఓడిపోవడం ఖాయమన్నాడు.
'పవర్‌ప్లేలో జైస్వాల్, గిల్ అవుటవడం భారత్‌కు పెద్ద ఎదురు దెబ్బ. ఇక టీంలో ఏడో నెంబర్ వరకే బ్యాటర్లు ఉన్నారు. చివరి నలుగురు బ్యాటుతో ఏం చేయలేరు. వాళ్లెవరికీ కూడా బౌండరీలు బాదే సత్తా లేదు. మిగతా బ్యాటర్లలో.. ఆరంభంలోనే రెండు, మూడు వికెట్లు పోతే ఆ తర్వాత వచ్చే వాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది' అని జాఫర్ వివరించాడు.
'అదే టీం కనుక ఐదు వికెట్లు కోల్పోయిందంటే.. టెయిలెండర్లు వచ్చేస్తారు. విండీస్ సిరీసులో భారత్ ఓడిన మ్యాచుల్లో అదే జరిగింది. ఇది టీంకు ఆందోళన కలిగించే అంశం. బ్యాటింగ్ విభాగం తేలిపోయింది. సూర్య ఆడినా అతనికి సహకారం అందలేదు. ఇలా ఏడుగురు బ్యాటర్లతో ఆడటం వల్ల.. ఆరంభంలో వికెట్లు పోతే మిగతా వాళ్లపై చాలా ఒత్తిడి పెరుగుతుంది' అని చెప్పాడు.
'టాప్-7 ప్లేయర్లు ఎక్కువ ఓవర్లు ఆడాలనేది నిజమే. కానీ ఒక్కోసారి ఇలాంటి మైండ్ సెట్ వల్ల పని జరగదు. ఈ సమస్యపై టీమిండియా ఫోకస్ పెట్టాలి. మరో పది నెలల్లో టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉంటుంది. అప్పుడు కూడా ఇదే టెంప్లేట్‌లో ఆడితే కష్టం. కనీసం 8, 9వ నెంబర్ వరకు భారీ షాట్లు ఆడగలిగే వాళ్లు ఉండాలి' అని సలహా ఇచ్చాడు.