
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యాడు. 2021 సంవత్సరానికిగానూ తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో క్రికెట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డు విన్నర్లను అజిత్ అగార్కర్, రసెల్ ఆర్నాల్డ్, ఇయాన్ బిషప్, డారిల్ కలినన్, డారెన్ గంగా, టామ్ మూడీ, డేనియల్ వెటోరిలతో కూడిన 20 మంది సభ్యుల జ్యూరీ ఎంపిక చేసింది. ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ అవార్డులను అందజేయడం ఇది 15వ సారి. ఇక ఈ అవార్డుల్లో 2021 సంవత్సరానికి గాను టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉత్తమ టెస్ట్ బ్యాటింగ్ అవార్డుకు ఎంపికయ్యాడు. 2020-21 ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గబ్బా వేదికగా సిరీస్ డిసైడర్ నాలుగో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో 329 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా పంత్ చివరి వరకు 89 పరుగులతో అజేయంగా నిలిచి అద్బుత ఆట తీరుతో భారత్‌ను గెలిపించాడు. పంత్ ఆడిన ఆ అద్భుత ఇన్నింగ్స్‌కు గాను అతడిని 2021 బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ అవార్డుకు క్రిక్ఇన్ఫో ఎంపిక చేసింది.
ఇక 2021 సంవత్సరానికి ఉత్తమ టెస్టు ఫార్మాట్ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ ఎంపికయ్యాడు. కివీస్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో గెలిపించినందుకుగాను అతన్ని ఈ అవార్డు వరించింది. ఉత్తమ టెస్ట్ బౌలింగ్ అవార్డుకు న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ ఎంపికయ్యాడు. భారత్ తీసిన 5 వికెట్లకు గాను అతనికి ఈ అవార్డు లభించింది. పాకిస్థాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ వన్డే బ్యాటింగ్ అవార్డుకు ఎంపికయ్యాడు. సౌతాఫ్రికాపై అతను చేసిన 193 పరుగులకు గాను ఈ అవార్డు వరించింది. వన్డే బౌలింగ్ అవార్డు సకీబ్ మహమూద్‌ను వరించింది. పాకిస్థాన్‌పై అతను 4 వికెట్లు తీసినందుకు ఈ అవార్డు లభించింది.
టీ20 బ్యాటింగ్ అవార్డుకు ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ఎంపికయ్యాడు. శ్రీలంకపై చేసిన 101 పరుగుల ప్రదర్శనకుగాను ఈ అవార్డు వరించింది. ఇక టీ20 బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు పాకిస్థాన్ ప్లేయర్ షాహీన్ అఫ్రిది ఎంపికయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌పై 3 వికెట్లు తీసినందుకు అతనికి ఈ అవార్డు వచ్చింది. కాగా డెబ్యూటెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఒలీ రాబిన్సన్ ఎంపికయ్యాడు.